341వ రోజు పాదయాత్ర డైరీ | 341th day padayatra diary | Sakshi
Sakshi News home page

341వ రోజు పాదయాత్ర డైరీ

Published Thu, Jan 10 2019 1:45 AM | Last Updated on Thu, Jan 10 2019 8:15 AM

341th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం: 3,648 కిలోమీటర్లు
341వ రోజు నడిచిన దూరం: 9.1 కిలోమీటర్లు
09–01–2019, బుధవారం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా

రాజన్న రాజ్యాన్ని తేవాలన్న ప్రజా సంకల్పం.. నాలో వజ్ర సంకల్పంగా మారింది 
మన సంకల్పం మంచిదైతే దేవుని దయ కూడా తోడవుతుంది. 14 నెలల కిందట ఇడుపులపాయలో నాన్నగారి పాదాల చెంత ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్తూపాన్ని చేరింది. 341 రోజులుగా 13 జిల్లాల్లో.. 3,648 కి.మీ సాగిన యాత్ర.. నేటితో ముగిసింది. నాన్నగారు, సోదరి షర్మిల, నేను.. మా ముగ్గురి పాదయాత్రలు ఇచ్ఛాపురంలోనే ముగియడం చరిత్రాత్మకం. దానికి గుర్తుగా 3 స్తూపాలుండటం ఓ మధుర జ్ఞాపకం. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం.. కోట్లాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలవడం.. ప్రపంచ చరిత్రలో ఎవరికీ దొరకని అదృష్టం. ఇది దైవ నిర్ణయం.. ఇది ప్రజల ఆశీర్వాదం. కోట్లాదిమంది గుండె చప్పుళ్లు వినగలగడం.. నా జీవితానికే గొప్ప అనుభవం. నా ఈ పాదయాత్ర ప్రజల కష్టాలను, కడగండ్లను దగ్గరగా చూడగలిగిన అవకాశం. పరిష్కరించదగిన చిన్న చిన్న సమస్యలూ తీరకపోవడంతో ఏళ్ల తరబడి వారు చేస్తున్న జీవన పోరాటం.. గుండెను బరువెక్కించింది. అత్యధికశాతం సమస్యలకు పాలకులే కారణమవడం ఆశ్చర్యమేసింది. గుండె ను పిండే దయనీయ గాథలెన్నో ఎదురయ్యాయి.  

ఉదయగిరిలో అంకమ్మరావు అనే బలహీనవర్గాలకు చెందిన ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ సోదరుడు.. ఫీజురీయింబర్స్‌కాక, బకాయిలు కట్టడానికి కూలి చేసే తండ్రి పడుతున్న కష్టాన్ని చూడ లేక ఆత్మహత్య చేసుకోవడం మనసును కలచివేసింది. అప్పులు తీర్చడానికి కిడ్నీ అమ్ముకున్న ఓ అన్నదాత.. బతుకుదెరువుకు గుంటూరు జిల్లా లోని ఓ చిన్న హోటల్లో పనిచేస్తుండటం అత్యంత దయనీయం. కొండకెంగువలో 108 రాక.. దండసి మేరీ అనే ఓ సోదరి ఆటోలో కుదుపులకు రక్తస్రావమై పురిటిలోనే బిడ్డను కోల్పోయిన ఘటన చలింపజేసింది. విజయవాడలో నిండా 30 ఏళ్లు నిండని ఓ ముస్లిం సోదరి.. ఆరోగ్యశ్రీ అందక, సీఎం సహాయ నిధి రాక, కిడ్నీ చికిత్స కోసం భర్త నడుపుకుంటున్న ఆటోనూ అమ్మేసుకుని.. ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తుండటం గుండెను పిండేసింది. రుణమాఫీ మాటలు నమ్మి మోసపోయి.. చేయని పాపానికి లాయర్‌ను పెట్టుకుని కోర్టు మెట్లెక్కిన వెంకటాపురం దళితవాడ డ్వాక్రా అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూశాను.

90 ఏళ్లు పైబడ్డ పండు ముసలివాళ్లు.. భర్తలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులు మొదలుకుని.. వందశాతం వైకల్యంతో మంచానికే పరిమితమైన దివ్యాంగుల వరకు.. దాదాపు 900 మంది కి నిర్దాక్షిణ్యంగా పింఛన్లు తొలగించిన పాలక నేతల రాక్షసత్వం పొందూరులో నా దృష్టికొచ్చింది. అమ్మణ్ణమ్మ అనే అవ్వ చనిపోయిందని పింఛన్‌ ఆపితే.. ‘నేను బతికే ఉన్నా’నని కోర్టులో చెప్పుకోవాల్సిరావడం.. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం లఉన్న మెట్ట లక్ష్మి అనే సోదరి వితంతువు కాదం టూ పింఛన్‌ ఆపితే.. ‘నాకు పింఛన్‌ అవసరం లేదు.. నా భర్తను చూపండిచాలు’ అంటూ న్యాయమూర్తికి మొరపెట్టుకోవడం.. ప్రభుత్వ దాష్టీకాలకు పరాకాష్ట. భర్తలుండగనే పిఠాపురంలో తప్పుడు డెత్‌ సర్టిఫికెట్లు సృష్టించి.. సుమంగళిలను వితంతువులుగా చూపించి.. పింఛన్లు మింగేసిన వైనం.. అధికార నేతల దిగజారుడుతనానికో నిదర్శనం. అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోనే.. ఈ పాలనలో ఏకంగా ఏడుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వ్యవసాయ దుస్థితికి అద్దం పట్టింది. ప్రభుత్వ సాయం కరువై.. జీవచ్ఛవాల్లా బతుకుతున్న ప్రకాశం ఫ్లోరైడ్‌ కథలు.. ఉద్దానం కిడ్నీవెతలు.. కంటతడి పెట్టించాయి. ముఖ్య మంత్రిగారిచ్చిన తుపాను పరిహారపు చెల్లని చెక్కు ల మోసాలు.. వనరులన్నింటినీ దోచేసిన వైనాలు.. జన్మభూమి కమిటీల దుర్మార్గాలు.. వంచిపబడ్డ అన్ని కులాల, వర్గాల, సంఘాల ఆక్రోశాలు.. జీవితాలను ఛిద్రంచేసిన మద్యం కథలు.. వలసల వెతలు.. అభివృద్ధిలేక, సంక్షేమం అందక సంక్షోభంలో కూరుకుపోయిన జనజీవితాలు.. ఒక్కటేమి టి, సమస్తం పాదయాత్రలో సాక్షాత్కరించాయి.  

చెప్పుకునే దారిలేక.. మనసు విప్పే మార్గం కనిపించక.. తల్లడిల్లుతున్న కోట్లాది జనం నా అడుగులో అడుగులేశారు. వారి ప్రేమ, ఆప్యాయతలే నన్ను నడిపించాయి. ఆ ప్రజా సంకల్పమే దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికింది. అధికార పార్టీ అవకాశవాద ముసుగు తొలగించింది. కన్ను కుట్టిన పాలక నేతల కుట్రల నుంచి పుట్టుకొచ్చిన హత్యాయత్నం నుంచి.. ప్రజాశీర్వాదమే నన్ను కాపాడింది. ఆ ప్రజల నమ్మకం.. నా బాధ్యతను మరింత పెంచింది. ‘ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంతమంది హృదయాల్లో జీవించామన్నది ముఖ్యం’ అన్న నాన్నగారి మాటలు నా మదిలో మెదలుతున్నాయి. రాజన్న రాజ్యాన్ని తేవాలన్న ప్రజా సంకల్పం.. నాలో వజ్ర సంకల్పంగా మారింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారి పాదయాత్ర నుంచి ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయింబర్స్‌వంటి అనేక అద్భుత పథకాలు పుట్టుకొచ్చాయి. మీ పాదయాత్ర నుంచి వచ్చిన ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? మీ పాదయాత్ర  హామీలు నెరవేరకపోగా.. ఆ నాటి సమస్యలు మరింత జటిలమయ్యాయని.. మీ వల్లే మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చాయని.. జీవితాలు దుర్భర మయ్యాయని.. ప్రజలు ఆక్రోశిస్తున్నారు.. వారికేం సమాధానం చెబుతారు? 
-వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement