06–01–2019, ఆదివారం
తలతంపర, శ్రీకాకుళం జిల్లా
దళారీల రాజ్యంలో రైతన్నలకు ధరలెలా గిట్టుబాటు అవుతాయి?
పాదయాత్ర ప్రారంభించి నేటికి సరిగ్గా 14 నెలలు గడిచిపోయాయి. ఉదయం పాదయాత్ర ప్రారంభంలోనే చంద్రబాబుపై ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని నాతో ఆవిష్కరింపజేశారు. శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా వలసల కథలు కదిలించాయి. వలసల్లో అగ్రస్థానం ఇచ్ఛాపురం నియోజకవర్గానిదే. ఈ పాలనలో వ్యవసాయం కష్టమైంది. చేపల వేట భారమైంది. పరిశ్రమలు లేవు.. ఉపాధి కరువైంది. ఉపాధి పనులూ లేవాయే. వలసలు తప్ప మరో మార్గం లేని దుర్భర పరిస్థితి. ఎక్కడో దూరాన చెన్నైలో, కోల్‌కతాలో బిల్డింగులు కూలినా, పాకిస్థాన్ సముద్ర జలాల్లో అక్కడి సైన్యానికి బందీలుగా చిక్కినా, విదేశాలకు పంపే బ్రోకర్ల చేతుల్లో మోసపోయినా, అండమాన్ దీవుల్లో, గల్ఫ్ దేశాల్లో విషాద గాథలు బయటపడ్డా.. బాధితుల్లో శ్రీకాకుళం జిల్లా వాసుల పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వేలాదిమంది కాలే కడుపులతో వలస వెళ్లడం ప్రభుత్వ వైఫల్యమే. వలస కూలీల కష్టాలు వింటుంటే మనసంతా బరువెక్కిపోయింది. కురేష్, మహాలక్ష్మిల కుమారుడు దుంపరాజు అలా వలస వెళ్లిపోయి రెండేళ్లవుతున్నా ఆచూకీ లేదట. అలాంటి కథే రాజేశ్వరిది. ఆమె భర్త బైరాగి మూడేళ్లయినా ఇంటికి తిరిగిరాలేదట. చాలా బాధనిపించింది. ప్రజలకు ఉపాధి కల్పించడానికి కనీస ప్రయత్నమే చేయని ప్రభుత్వాన్ని ఏమనాలి? దళారీ వ్యవస్థలతో రైతాంగాన్ని, మత్స్యకారులను దెబ్బతీస్తున్న ఈ పాలకులే వలసలకు బాధ్యులు కారా?
జింకిబద్ర వద్ద టమాటా రైతులు కలిశారు. ఆరుగాలం కష్టించే వీరు అద్భుతమైన దేశవాళీ టమాటాలు పండించడంలో చేయితిరిగినవారు. నాణ్యమైన టమాటాల అధిక దిగుబడి సాధిస్తూనే ఉంటారు. ‘అదేం మాయో కానీ.. అంతవరకు బాగా ఉన్న టమాటా ధర తీరా పంట చేతికొచ్చే సమయానికి ఒక్కసారిగా పతనమైపోతుంది’ అంటూ బావురుమన్నారు. పెట్టుబడి కూడా రాక నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నమే చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీల రాజ్యంలో రైతన్నలకు ధరలెలా గిట్టుబాటు అవుతాయి? రాత్రికి రాత్రే ధరలు పతనమయ్యే మాయలు, మోసాలు లేకపోతే అది బాబుగారి పాలన ఎలా అవుతుంది?
సోంపేటలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డు విస్తరణ పనులు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ గురించి ప్రజలు ఫిర్యాదులు చేశారు. కవిటి జూనియర్ కళాశాల విద్యార్థినులది పైకి చెప్పుకోలేని కష్టం. ఈ కాలేజీలో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉన్నారట. ఎలాంటి టాయ్‌లెట్ సౌకర్యాలు లేవు. అవసరం పడితే ఆరుబయట బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుందట. సిగ్గుతో చితికిపోతున్నామని.. ఎదిగిన ఆ ఆడబిడ్డలు చెబుతుంటే చాలా బాధనిపించింది.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో అయినవారిని, ఉన్నవారిని వదులుకుని, పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిపోతుంటే.. అధిక ఆదాయం కోసం అలవాటుగా వలస వెళ్తున్నారని వ్యాఖ్యానించడం మానవత్వమేనా?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment