ఇప్పటివరకు నడిచిన దూరం – 3,638.9 కి.మీ.
340వ రోజు నడిచిన దూరం – 10.7 కి.మీ.
08–01–2019, మంగళవారం,అగ్రహారం, శ్రీకాకుళం జిల్లా.
ఉద్దానంలో దారుణ పరిస్థితిని మార్చాలన్న తపన కాస్తయినా లేని ప్రభుత్వాన్ని ఏమనాలి?
పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. ‘విజయ సంకల్పం’ స్తూపం వైపు అడుగులు చేరువయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పాదయాత్ర చేసేటప్పుడు వెంకట రాంబాబు అనే ఆటో డ్రైవర్ కలిశాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు మణికంఠకు బ్రెయిన్ ట్యూమర్. ఆస్పత్రులకు వెళ్తే రూ.ఆరు లక్షలు అవుతుందన్నారు.. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. ఆ తండ్రి నిస్సహాయతను చూసి జాలేసింది. పిల్లాడికి వైద్యసాయం అందేలా చేశాను. ఆపరేషన్ పూర్తయి ఆ బిడ్డ ఆరోగ్యవంతుడయ్యాడు. ఈరోజు ఆ తండ్రి కొడుకును ఎత్తుకుని వచ్చి సంతోషాన్ని పంచుకుంటుంటే మనసంతా తృప్తితో నిండిపోయింది.
ఈరోజు కవిటి మండలంలో పాదయాత్ర సాగింది. దేశంలోనే అత్యధికంగా కిడ్నీ వ్యాధికి గురయ్యే ప్రాంతమిది. కాళ్లు, మొహం, కళ్ల వాపులతో నడవడానికి సత్తువ లేని ఎందరో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. వారిలో నాలుగైదేళ్ల చిన్నారుల నుంచి పండు ముసలివారి వరకు ఉన్నారు. వారంతా నిరుపేదలైన వ్యవసాయ కూలీలు, మత్స్యకార కుటుంబాలవారే. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. మందులు లేక, డాక్టర్లు అందుబాటులో లేక, డయాలసిస్ సేవలు సరిగా అందక, పింఛన్లు రాక, ఆదుకునేవారే లేక జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. శ్రీహరిపురం వద్ద కలిసిన ఆ విధివంచితుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దయనీయ గాథ. బుథియా అనే తాత ఒక కొబ్బరి కూలీ. కిడ్నీ వ్యాధిబారిన పడి ఏ పనీ చేయలేకపోతున్నాడు. అతని బిడ్డలు వలస కూలీలు. వేలకు వేలు ఖర్చు చేసి తండ్రికి చికిత్స చేయించలేని దుస్థితి వారిది.
విధిరాత ఇంతేననుకుని, దేవుడిపై భారం వేసి ఇంటిపట్టునే ఉంటున్నానని ఆ తాత చెబుతుంటే గుండె బరువెక్కింది. బొడియా జమున కుటుంబ గాథ మరింత దయనీయం. ఒకే కుటుంబంలో కిడ్నీ వ్యాధితో నలుగురిని కోల్పోయిన విషాదం. ఒక్కొక్కరి వ్యథ వింటుంటే మనసు కలత చెందింది. ఒకప్పుడు ఉద్యానవనంలా వెలుగొందిన ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధి కబళించి వేస్తోందా అనిపిస్తోంది. ఇక్కడివారిని పెళ్లి చేసుకోవడానికి బయట ప్రాంతాలవారు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పనిచేయడానికి ఉద్యోగులు కూడా ముందుకు రావడం లేదట. వలస వెళ్లిపోయినవారు, ఈ ప్రాంతాన్ని వదిలేసి బయట ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఎందరో ఉన్నారట. ఉద్దానం ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని మార్చాలన్న తపన కాస్తయినా లేని ప్రభుత్వాన్ని ఏమనాలి?
చుట్టా దున్నా అనే అన్న కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘ఈ ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వడం లేదు కానీ వద్దన్నా మద్యాన్ని మాత్రం సరఫరా చేస్తోంది. అంతంతమాత్రంగా ఉన్న కిడ్నీలు మద్యం దెబ్బకు పూర్తిగా పాడయ్యాయి’ అంటూ ఆయన భార్య చుట్టా లక్ష్మి కన్నీటిపర్యంతమైంది. ప్రజల ప్రాణాలు పోతున్నా కనీస వైద్య సాయం అందించడంలో లేని శ్రద్ధ మద్యం వ్యాపారంపై ఉండటం దౌర్భాగ్యం. ప్రజల ఆరోగ్యం పాడైనా పర్లేదు.. ఆదాయం వస్తే చాలనుకునే పాలనలో ఉద్దానం వెలుగులు ఎండ మావులేనేమో!
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న..మీరు ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సేవలే లేనప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షలకు పెంచుతున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తున్నామని పెద్దపెద్ద ప్రకటనలివ్వడం ప్రజలను దారుణంగా వంచించడం కాదా?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment