అనంతగిరి, న్యూస్‌లైన్: జిల్లాలోని శివారు పంచాయతీలను గ్రేటర్‌లో విలీనానికి నిరసనగా ఈ నెల 20న (శుక్రవారం) నార్సింగిలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం 8 గంటలకు 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఉనికి లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే సీఎం కిరణ్ 36 గ్రామ పంచాయతీలను గ్రేటర్ కలిపారని ఆరోపించారు. గ్రేటర్‌కు సమీపంలోని మణికొండను విలీనం చేయకుండా వదిలేయడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో లగ డపాటి ల్యాంకో హిల్స్, రాయపాటి ఆస్తులుండడమే కారణమన్నారు. తమకు నష్టం వాటిల్లుతుందనే వీరంతా కుమ్మక్కయ్యారన్నారు. విలీన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో జరిగే పరిణామాలకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 20నజరిగే నిరసన కార్యక్రమానికి తెలంగాణ వాదులు వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.