సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కాకుండా వాటిని మునిసిపాలిటీలు/నగర పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలిపారు. ఇందుకోసం శివారు పంచాయతీలకు తాజాగా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వీటిని మునిసిపాలిటీలు/నగర పంచాయతీలుగా మార్చాలన్న నిర్ణయం కారణంగా వీటికి ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల సంఘాన్ని కోరారు. గతవారంలో శివారు పంచాయతీలను విలీనం చేస్తున్నారా.? కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు చేస్తారా..? లేక వాటికి ఎన్నికలు నిర్వహించాలా? ఏదో విషయాన్ని తేల్చి చెప్పండంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించడంతో ఈ పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శివార్లలోని పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశం తిరస్కరించిన విషయం తెలిసిందే. మొత్తం 39 గ్రామ పంచాయతీలను ఆరేడు నగర పంచాయతీలు, మునిసిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిబంధనలను అనుసరించి ఆయా పంచాయతీలకు నోటీసులు జారీ చేసి, ఆ తరువాత గ్రామ సభలు నిర్వహించనున్నారు. శంషాబాద్, బోడుప్పల్, నార్సింగి, నాగారం, జవహర్‌నగర్, కిస్మత్‌పూర్ పంచాయతీలకు వాటి పక్కనే ఉన్న పంచాయతీలను కలిసి వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గ్రేటర్‌లో విలీనం కావడాన్ని నిరసిస్తూ 15 గ్రామపంచాయతీల ప్రజలు హైకోర్టు వెళ్లిన నేపథ్యంలో విలీనానికి అనుసరించిన పద్ధతిని హైకోర్టు తప్పుపట్టడంతోపాటు విలీన ఉత్తర్వులను కొట్టేసిన సంగతి తెలిసిందే.
శివారు పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తాం
Published Tue, Nov 5 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement