శ్రీవారి దర్శనానికి 26గంటలు
తిరుమల, న్యూస్‌లైన్: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుప్పావై సేవ వల్ల దర్శనం ఆలస్యంగా ప్రారంభం కావడంతో సర్వదర్శనం, కాలినడక, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు క్యూలలో బారులుదీరారు. శ్రీవారి దర్శనానికి 26గంటల సమయం పడుతోంది. అధిక రద్దీ కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రూ. 300 దర్శనాన్ని నిలిపివేశారు. సాయంత్రం 5.30 గంటలకు కాలినడక భక్తుల క్యూను కూడా నిలిపివేశారు.
గురువారం వేకువజాము 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 33,193 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట కిలోమీటరు మేర క్యూలో బారులుదీరారు. వృద్ధులు, చంటి బిడ్డలతో వచ్చిన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు.
రాహుకేతు పూజలు ఇక వెలుపలే!
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇకపై రాహుకేతు పూజలు ఆలయం వెలుపలే నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఆ మేరకు వేదపండితుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేవస్థానం ఆధ్వర్యంలో రాహుకేతు పూజలు నాలుగు రకాలుగా జరుగుతున్నాయి. పూజల సమయంలో వేదపండితులు మైకుల ద్వారా మంత్రాలు చెబుతుంటారు. ఆ శబ్దానికి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రాహుకేతు పూజలను ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మండపాల్లో నిర్వహించాలని అధికారులు ఉద్దేశంగా తెలుస్తోంది.