సాక్షి ప్రతినిధి, రాజమండ్రి : ఒక వైఫల్యం పెను విషాదాన్ని సృష్టించింది. ఒక జాప్యం ఎన్నో జీవితాలను చిదిమేసింది. వేచివేచి ఉన్న వేలమంది భక్తుల ఆరాటం, అసహనం కొద్దిమంది తోటిభక్తులకు మరణశాసనమయ్యాయి. పుష్కరఘాట్ వాకిట కాలయముని దున్నగిట్టల చప్పుడు కఠోరంగా మార్మోగింది. రాజమండ్రిలోని ఆ రేవు వద్ద పుష్కరాల తొలినాడే జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ సంఘటన జాతి యావత్తునూ కలచివేసింది. ఎన్నడు మొదలయ్యాయో తెలియని గోదావరి పుష్కరాల చరిత్రలో ఎన్నడూ లేని కన్నీటి ఘట్టం నమోదయ్యింది.గడచిన పుష్కరాల్లో గోదావరిలో నీటమునిగి కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నా అవన్నీ మానవతప్పిదాలే. కానీ అందుకు పూర్తి భిన్నమైన ఘటన రాజమండ్రిలో మంగళవారం జరిగింది. ఈ ఘోరంతో పుష్కర భక్తుల్లో అభద్రతాభావం పెచ్చరిల్లింది. జిల్లాలో రాజమండ్రి సహా గ్రామీణప్రాంతాల్లో ఘాట్‌లకు వెళ్లాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది.
చర్యలన్నీ దుర్బలమే..
జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలో అనేక ఘాట్‌లు ఉన్నా రాజమండ్రిలోని ఘాట్‌లకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఆధ్యాత్మిక శోభ, సాంస్కృతిక సౌరభాలతో దేశం నలుమూల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులను అలరిస్తాయంటూ గొప్పలకు పోయింది. ఇందులో భాగంగా రాజమండ్రిలో పలు ఘాట్‌లలో చేసిన ఏర్పాట్లపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన ప్రచారాన్ని కల్పించింది. ముఖ్యమంత్రితో పాటు పుష్కర కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రి నారాయణ, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తవంటూ పదేపదే చెప్పుకుంటూ వచ్చారు.
చంద్రబాబు పలు పర్యాయాలు రాజమండ్రికి వచ్చి ఇక్కడే మకాం చేసి సమీక్షలపై సమీక్షలు నిర్వహించి తీరా సాధించిందేమిటని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నిర్వాకం ఇలా ఉంటే జిల్లా అధికార యంత్రాంగంలో జడత్వం కూడా ఇందుకు తోడైంది. ఏర్పాట్లలో రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్‌కు సంబంధించి పోలీసులు గడచిన నెల రోజులుగా తీసుకున్న చర్యలు ఎంత దుర్బలమైనవో ఈ ఘోర దుర్ఘటనతో తేటతెల్లమైందని విజ్ఞులు అంటున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులను అంచనా వేయడంలోను, ఒకేసారి లక్షలాదిగా వచ్చే భక్తులను ఘాట్‌ల వద్దకు ఒక క్రమపద్ధతిలో అనుమతించడంలో వైఫల్యంచెందడంతోనే అమాయకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్వాకంతో గోదావరి పుష్కరాల పుణ్యఘట్టం కాస్తా తొలిరోజే విషాదఘట్టాన్ని సృష్టించింది.
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అపచారమా?
కాగా, ఈ ప్రమాద ఘటనపై ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులు మాత్రం సెంటిమెంట్‌తో కూడిన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర స్థలమైన పుష్కరాల రేవులో కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్లే ఈ అపశృతి జరిగిందంటున్నారు. వాస్తవానికి ఈ విగ్రహం ఏర్పాటు విషయం మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. రాజమండ్రిలో అఖిలపక్షం విగ్రహం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. చివరకు ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉండగానే సీఎం చంద్రబాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు ముందు రోజు మూడువేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ స్థాయి బందోబస్తు మంగళవారం ఉదయం పుష్కరఘాట్ వద్ద చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదనే వాదన వినిపిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెత చందంగా 27 మంది భక్తులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాక రాష్ట్ర పోలీసు బాస్ రాముడు మంగళవారం అర్థరాత్రి రాజమండ్రిలోని పలు ఘాట్‌లను సందర్శించారు. ఇక బందోబస్తుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి నొక్కి చెప్పారు. ఎన్ని చెపితే వరదలో కొట్టుకుపోయిన గడ్డిపరకల్లా.. గాలిలో కలిసిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి? వృుతుల ఆత్మీయుల కన్నీటి వెల్లువకు అడ్డుక ట్ట పడుతుంది?
మృత్యుతీరం
Published Wed, Jul 15 2015 3:49 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement