నగరం ఉత్సవ శోభను సంతరించుకుంది. సంస్కృతీ సంప్రదాయాలను మరోసారి చాటిచెప్పేందుకు వినూత్నంగా సన్నద్ధమైంది. స్థానిక కళాకారులతో ఆకర్షణీయంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందింది. వివిధ కార్యక్రమాలకోసం ఎంపిక చేసిన వేదికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. తొలిరోజు కళాకారుల శోభాయాత్రతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఉన్నంతలో ఘనంగా నిర్వహించి... దుబారాను అదుపు చేసేలా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఫ్లవర్‌షో... పెట్స్‌షో... వంటి వాటితో పాటు ఈ సారి అదనంగా చిత్రలేఖనం, లఘుచిత్రాల పోటీలు, బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సాక్షి, విజయనగరం : విజయనగరానికి ఉత్సవ శోభ వచ్చింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు విజయనగర ఉత్సవాలు జరగనున్నాయి. నాలుగో రోజు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగబోతోంది. దేశంలోనే ప్రత్యేకంగా సిరిమానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా నిర్వహిస్తోంది. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విజయనగరం ఉత్సవాలు ఇక్కడి సంస్కతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా స్థానిక కళారూపాలు అలరించనున్నాయి. వివిధ వేదికల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది చిత్రలేఖనం, లఘుచిత్రాల పోటీలు, బాణాసంచా వెలుగులు అదనపు ఆకర్షణగా నిలువనున్నాయి.
ఉత్సవాల ప్రారంభంరోజైన 12న తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ పైడితల్లమ్మ ఆలయం నుంచి ఆనందగజపతి కళాక్షేత్రం వరకూ వివిధ కళారూపాలతో ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు వర్గాలకు చెందిన ప్రముఖులు, మేథా వులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆనందగజపతి కళాక్షేత్రం వద్ద ప్రారంభోత్సవ సభ ఉంటుంది. దీనికి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పాములపుష్పశ్రీవాణి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా మంత్రి బొత్ససత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఈ సభలో జిల్లాకు చెందిన 15 మంది ప్రముఖులను సన్మానించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఇదే వేదిక వద్ద మధ్యాహ్నం 2.00 గంటల నుంచి స్థానిక కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మిగిలిన రెండు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచే మొదలవుతాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు మహారాజ సంస్కృత కళాశాల వద్ద ప్రాచీన ప్రాచ్య గ్రంథ ప్రదర్శన, అష్టావధానం, కవి సమ్మేళనం, సాంస్కృతిక వారసత్వంపై క్విజ్ పోటీలు, పుస్తక ప్రదర్శన నిర్వహిస్తారు. మిగిలిన రెండు రోజులు కూడా ఇది కొనసాగుతుంది. మహారాజ కోట వద్ద సైన్స్ ఫేర్, ఫొటో ఎగ్జిబిషన్, పెయింటింగ్ ఎగ్జిబిషన్, స్టాంప్స్ ఎగ్జిబిషన్, హస్తకళ ప్రదర్శన ఉంటుంది. రెండో రోజు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.
ప్రత్యేక ఆకర్షణగా పుష్ప, ఫల ప్రదర్శన
ఎమ్మార్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వద్ద ఉదయం 10 గంటలకు పుష్ప ఫల ప్రదర్శన ప్రారంభంమై, ఇది మిగిలిన రెండురోజులూ కొనసాగుతుంది. టీటీడీ కల్యాణ మండపం వద్ద రోజూ సాయంత్రం 6 గంటల నుంచి భక్తి సంగీతం, హరికథలు, భజనలు ఏర్పాటు చేశారు. గురజాడ కళాభారతిలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఏకపాత్రాభినయాలు, నాటికలు ఉంటాయి. రెండో రోజైన 13న అదనంగా ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు క్రీడా పోటీలు జరుగుతాయి. రాజీవ్ క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు వివిధ క్రీడా పోటీలు, అయోధ్యా మైదానంలో ఉదయం 9 గంటల నుంచి స్త్రీలకు ముగ్గుల పోటీలు, సాయంత్రం 4 గంటలకు పెట్ షో, డాగ్ షో ఉంటాయి. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి హరిత విజయనగరంపై లఘు చలనచిత్రాల ప్రదర్శన ఉంటుంది.
జానపద కళలకు పెద్దపీట
చివరి రోజైన 14వ తేదీన జానపద కళలకు ప్రత్యేక అవకాశం కల్పించారు. ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 నుంచి హరిత విజయనగరంపై చిత్రలేఖన పోటీలు, కోట బహిరంగ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు పులివేషాల పోటీలు, జానపద, సంప్రదాయ కళల ప్రదర్శనలు, ఆనందగజపతి కళాక్షత్రంలో ఉదయం 9 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, విజయనగరం ఉత్సవాల ముగింపు వేడుకలు జరుగుతాయి.
పైడితల్లికి ప్రత్యేక వెలుగులు
శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం 15వ తేదీన సంప్రదాయ బద్ధంగా జరగనుంది. అనంతరం సాయం త్రం 6 గంటల నుంచి రాత్రి వరకూ రాజీవ్ స్టేడియంలో భారీ బాణ సంచా వేడుకలు ఘనంగా జరుపుతారు. ప్రతి ఏడాది అయోధ్యా మైదానం లో నిర్వహించే కార్యక్రమాలను ఈ ఏడాది నిర్వహించడం లేదు. ఆ లోటు లేకుండా గతేడాది కంటే మిన్నగా అత్యంత వైభవంగా విజయనగర ఉత్సవాలను, పైడితల్లి జాతరను నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment