
శ్రీవారి దర్శనానికి 30 గంటలు
సెలవుల నేపథ్యంలో తిరుమల శనివారం భక్తజన సందోహమైంది. సర్వదర్శనం, కాలిబాట క్యూల్లో అన్నిచోట్లా కిక్కిరిసిన జనం కనిపించారు. క్యూల్లో చంటిబిడ్డలు, చిన్నారులు, వృద్ధులు నలిగిపోయారు. చిన్నారుల రోదనలు మిన్నంటాయి. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 55,857 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండి, వెలుపల కిలోమీటరు వరకు క్యూకట్టిన భక్తులకు దర్శన సమయం 30 గంటలు పడుతోంది.
శనివారం కావడంతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో కాలినడకన అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 13 కంపార్ట్‌మెంట్లలో నిండడంతో పాటు వెలుపల కిలోమీటరు దూరం వరకు క్యూ కట్టారు. వీరికి 18 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదుల కోసం పద్మావతి, సీఆర్‌వో, ఎంబీసీ-34 రిసెప్షన్ కేంద్రాల వద్ద భక్తులు పడిగాపులు కాచారు. తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్టల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
రద్దీ పెరగడంతో ముందుజాగ్రత్తగా టీటీడీ అన్ని రకాల బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. రాజ్యాంగ హోదా కలిగిన వ్యక్తులకు పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు కేటాయించారు. కాగా, ఈనెల 26వ తేదీ సోమవారం తిరుమలలో శ్రీవారి రథసప్తమి మహోత్సవం నిర్వహించనున్నారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమి పర్వదినాన ఏడు వాహన సేవల్లో స్వామిని దర్శించి తరించే అవకాశం ఉంది.
- సాక్షి, తిరుమల