హుస్నాబాద్, న్యూస్‌లైన్ : పశువులను ఒకచోట నుంచి మరోచోటికి తరలించినట్టు.. 38 మంది విద్యార్థులను ఆటోట్రాలీలో ఎక్కించి పంపించారు. పదిహేను మంది నిల్చునేందుకు వీలున్న ట్రాలీలో అంతకురెట్టింపు సంఖ్యలో చిన్నారులను కుక్కారు. విద్యార్థులను అందులో ఎక్కించి ఉపాధ్యాయులు తప్పిదం చేస్తే.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యం వారిని ప్రమాదంలోకి నెట్టింది. ఈ సంఘటన కోహెడ మండలం నాగసముద్రాల గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 38 మంది విద్యార్థులను స్కాలర్‌షిప్‌ల కోసం బ్యాంకు ఖాతా తీసేందుకు టాటా ఏస్ ఆటోట్రాలీలో ఎక్కించి ఉపాధ్యాయులు కోహెడకు పంపించారు.
మార్గంమధ్యలో నాగసముద్రాల క్రాసింగ్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయిన ఆటోట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో మొత్తం 21 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఆరుగురు విద్యార్థుల చేతులు, కాళ్లు విరిగిపోగా, ఏడుగురు విద్యార్థుల తలలకు, మరో విద్యార్థినికి కన్ను, వెన్నుపూసకు తీవ్రగాయాలయ్యాయి. శివరాత్రి చంద్రశేఖర్ తలకు, కన్నుపై, సుదగోని మణికంఠ కన్ను, వెన్నుపూసకు తీవ్రగాయాలు కాగా, తాటిపాముల అశ్విని, కె.రాజు, లింగాల మమత, లింగాల ప్రదీప్, కుంచం శేఖర్, దేవిశెట్టి ఆనిల్‌కు చేతులు, కాళ్లు విరిగాయి.
అభినాష్, మానస, వసంత, శిరీష, కుంచం మైనిక, జ్యోత్స్న, బొమ్మకంటి స్వప్న, మానస తల, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. తొలుత 17మందిని హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి, నలుగురిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. హుస్నాబాద్ ఆస్పత్రిలో ప్రాథమిక చికత్స చేసిన అనంతరం ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి, మిగతా 14మందిని కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో కొందరిని మెరుగైన చికిత్స కోసం పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. శివరాత్రి చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించగా ప్రమాదం జరిగిందని చెబుతున్నా అతివేగం వల్లే అనర్థం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. డబుల్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకపోవడం, రోడ్డు దిగుడుగా ఉన్నప్పటికీ డ్రైవర్ వేగంగా వెళ్లి వాహనాన్ని న్యూట్రల్ చేయడంతో అదుపుతప్పినట్లు విద్యార్థులు చెబుతున్నారు. సంఘటనకు దగ్గరలోనే కల్వర్టు ఉండగా.. అక్కడ ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం సంభవించేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు సురేష్, పీఈటీ హన్మంతు, డ్రైవర్ తిరుపతిలపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్ తెలిపారు.
పశువులను తరలించినట్టు..!
Published Sun, Dec 1 2013 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement