మరో అవకాశం
41 మద్యం షాపులకు మళ్లీ నోటిఫికేషన్
రేపటి నుంచే తెరుచుకుంటున్న సర్కారు దుకాణాలు
విశాఖపట్నం : ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలోని మొత్తం 406 మద్యం షాపుల్లో 39 షాపులు ప్రభుత్వం నిర్వహించనుంనుండగా మిగిలిన 367 షాపుల్లో 326 షాపులను రెండు రోజుల క్రితం లాటరీలో ప్రైవేటు వ్యాపారులకు అందించారు. అయితే 41 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో వాటికి మరోసారి దరఖాస్తులు ఆహ్వానించాల్సి వచ్చింది. దీంతో ఎక్సైజ్ అధికారులు బుధవారం 41 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీలోగా వ్యాపారులు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు పూర్తయిన వెంటనే అంటే 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరించి సాయంత్రం 5గంటలకు లాటరీ తీస్తారు. విశాఖ మురళీనగర్‌లోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తిచేసి షాపులు కేటాయించాలని నిర్ణయించారు.
మరోవైపు ప్రభుత్వం నిర్వహించదలిచిన 39 మద్యం దుకాణాలను ఎప్పుడు తెరవాలనేదానిపై అధికారులు తర్జన భర్జన పడ్డారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌కల్లాం ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం షాపుల కేటాయింపులపై అధికారులతో సమీక్ష జరిపిన ఆయన వెంటనే ప్రభుత్వ దుకాణాలు తెరవాలని ఆదేశించారు. దీంతో గురువారం విశాఖలో కనీసం మూడు షాపులు తెరవనున్నట్లు ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణ బుధవారం ‘సాక్షి’ కి వెల్లడించారు. ఈ నెల 5 లేదా 6వ తేదీ కల్లా జిల్లాలో 39 ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ షాపులను కూడా తామే దక్కించుకోవాలని, సింగిల్ టెండర్ల ద్వారా తమ పని జరుపుకోవాలని సిండికేట్లు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.