మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 44 మృతదేహాలను వెలికి తీశారు.
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సు నుంచి ఇప్పటివరకూ 44 మృతదేహాలను వెలికి తీశారు. ప్రయాణికులు సజీవ దహనం కావటంతో బస్సు కింద భాగం నుంచి కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బస్సులో మొత్తం 49మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో డీఎన్ఏ నిర్వహించిన అనంతరం చనిపోయినవారి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని .... ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.
ఇక ఈ దుర్ఘటన నుంచి అయిదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మజీర్ భాషా, బెంగళూరుకు చెందిన యోగేష్ , జయసింగ్, హైదరాబాద్ కు చెందిన శ్రీకర్, రాజేష్ మృత్యువును అతి దగ్గర నుంచి చూసి గాయాలతో బయటపడ్డారు. వీరందరికీ మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ఏరియా హాస్పిటల్ లో ప్రాధమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ డిఆర్డిఎల్ అపోలోకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనలో గాయపడ్డవారి వివరాలను జిల్లా పోలీసులు వెల్లడించారు