పాత బకింగ్‌హామ్ కెనాల్‌ను రూ.4800 కోట్లతో అభివృద్ధి చేయడం ద్వారా జలరవాణాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోదీ
రావులపాలెం : పాత బకింగ్‌హామ్ కెనాల్‌ను రూ.4800 కోట్లతో అభివృద్ధి చేయడం ద్వారా జలరవాణాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోదీ ఆమోద ముద్ర వేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. దీంతోపాటు గోదావరి, కృష్ణ, కావేరి నదులను అనుసంధానం చే యడానికి కూడా ప్రధాని ఆమోదం తెలిపారనన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం రావులపాలెంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఏటా గోదావరి నదిలో సుమారు 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పోలవరం ప్రాజెక్టు ద్వారా దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభించనున్నదని తెలిపారు. తద్వారా గోదావరి మిగులు జలాలను సాగునీరు లేని ప్రాంతాలకు తరలించేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానికి నాందిగా పుష్కర శోభాయాత్ర నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 4,800 మంది ఆయా ప్రాంతాల్లోని జలాలను పాత్రల్లో తీసుకువచ్చి గోదావరిలో కలిపి తిరిగి ఆ పాత్రలతో గోదావరి జలాలను తీసుకువెళ్లి వారి ప్రాంతాల్లోని దేవతామూర్తులకు అభిషేకిస్తారన్నారు.