5న తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం
Published Sat, Apr 1 2017 7:01 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 5వ తేదీన శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాత్రి 10 గంటలకు ఆస్థానం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీరామచంద్రమూర్తి రూపంలో తన భక్తాగ్రేసరుడు ఆంజనేయుని వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
6వ తేదీ రాత్రి 8 గంటలకు ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో ఈనెల 8 నుండి 10వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయానికి నైరుతి దిశలోని వసంత మంటపంలో చైత్ర శుద్ధ త్రయోదశి మొదలు పూర్ణిమ వరకు మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ఇతర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి. రెండో రోజు 9వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవారి రథోత్సవం ఉంటుంది. మూడో రోజు 10వ తేదీ స్నపన తిరుమంజనం కార్యక్రమాలతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, సీతారామ లక్ష్మణ, ఆంజనేయుడు, రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ స్వామి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. 9వ తేదీన సహస్ర కలశాభిషేకం, 10వ తేదీన తిరుప్పావడ సేవను కూడా రద్దు చేశారు.
Advertisement
Advertisement