నామినేటెడ్‌ పదవుల్లో యాభైశాతం వారికే | 50 Percent Reservation For Women In Nominated Posts In Viziangaram | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పదవుల్లో యాభైశాతం వారికే

Published Sat, Jul 27 2019 11:31 AM | Last Updated on Sat, Jul 27 2019 11:38 AM

50 Percent Reservation  For Womens In Nominated Posts In Viziangaram - Sakshi

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. ఇదీ ప్రస్తుత ప్రభుత్వ విధానం. అన్నింటా వారికి సమానావకాశాలు కల్పించారు. ప్రతి రంగంలోనూ వారికి పెద్ద పీటవేశారు. ఒకరికి ఉపముఖ్యమంత్రి పదవినీ.. మరొకరికి హోంశాఖను కట్టబెట్టిన సీఎం ఏకంగా నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం కేటాయిస్తూ బిల్లు ప్రవేశపెట్టి దానిని ఆమోదింపజేశారు. ఉగాదినాటికి మహిళల పేరునే ఇళ్లస్థల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను వంచించిన గత ప్రభుత్వం వారిని పథకాల ప్రచారానికీ.. సభలు.. సమావేశాలకే పరిమితం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం తమకు కల్పిస్తున్న అవకాశాలను చూసి మహిళా లోకం ఉబ్బి తబ్బిబ్బవుతోంది

సాక్షి, విజయనగరం : మహిళలకు అంతచేస్తాం... ఇంత చేస్తాం... అని కేవలం మాటలతోనే పబ్బం గడుపుకున్న గత పాలకుల హయాంలో మహిళలు రాజ్యాధికారాలకు దూరమయ్యారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన అనతి కాలంలోనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్‌ కల్పించారు. జిల్లాలో ఇప్పటికే మహిళకు ఎమ్మెల్యే సీటిచ్చి, గెలిచిన తర్వాత ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి, గిరిజన సలహామండలికి అధ్యక్షురాలిగా కూడా చేసి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిత్యం నరకం అనుభవిస్తూ అడుగడుగునా నయవంచనకు గురైన మహిళల బతుకుల్లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సంతో షాలు వెల్లివిరుస్తున్నాయి.

జిల్లాలో మహిళదే పైచేయి
జిల్లాలో 18,18,113 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,98,331 మంది పురుషులు, 9,19,654 మంది మహిళలు. పురుష ఓటర్ల కంటే 21,323 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగంలోనూ మహిళలే ముందున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,66,291 మంది ఓటు వేయగా వీరిలో 7,21,641 మంది పురుషులు, 7,44,630 మంది మహిళలున్నారు. ఈ లెక్కన ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్ల సంఖ్య 22,989 అధికం. విజయనగరం లోక్‌సభ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 14,99,300 మంది ఓటర్లుండగా వీరిలో 7,49,489 మంది పురుషులు, 7,49,688 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 12,08,191 మంది ఓటుహక్కు వినియోగించుకోగా... వారిలో 6,02,435 మంది పురుషులు, 6,05,749 మంది మహిళలు ఉన్నారంటే పురుషుల కంటే మహిళలే 3,314 అధికంగా ఓట్లేశారన్నమాట.

గత ప్రభుత్వంలో నరకం
గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలు నిత్యం నరకం అనుభవించారు. జిల్లాలో మెప్మా, డీఆర్‌డీఏ వెలుగు శాఖల ఆధ్వర్యంలో 45 వేల మహిళా పొదుపు సంఘాలున్నాయి. వీటిలో సుమారు 4,50,000 మంది సభ్యులున్నారు. డ్వాక్రా రుణ మాఫీ దగ్గర్నుంచి అన్ని రకాలుగా చంద్రబాబు వారిని మోసం చేశారు. సున్నా వడ్డీకే రుణాలిచ్చే విధానాన్ని పూర్తిగా దూరం చేసి మహిళలను అప్పులపాలు చేశారు. అక్కడితో ఆగకుండా సాధికారమిత్రల పేరుతో ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయించుకోవడం కోసం 15,672 మం దిని నియమించుకుని వారికి జీతాలివ్వకుండా వంచించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని కూడా ఎగవేసి వారు పస్తులుండేలా చేశారు. ఆదరణ పథకాన్ని బ్రష్టు పట్టించారు. వెలుగు ఉద్యోగులను రోడ్డున పడేశారు. అంగన్వాడీలకు కనీస వేతనా లు లేకుండా చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం సదస్సులకు ఆ మహిళలనే తరలించి వారి శ్రమను దోచుకున్నారు. చివరికి అదే మహిళల చేతిలో చిత్తుగా ఓడిపోయారు.

కొత్త ప్రభుత్వంలో పెద్దపీట
ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలను స్వయంగా విన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళా పక్షపాతిగా పేరుతెచ్చుకున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో పిల్లలను పాఠశాలకు, జూనియర్‌ కళాశాలకు పంపే తల్లులకు ఏటా రూ.15వేలు వంతున ఇస్తామని ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు, మధ్యాహ్న హోజన నిర్వాహకులకు, ఆశా వర్కర్లకు జీతాలు అనూహ్యంగా పెంచారు. మహిళలు కోరినదానికి మించి వారికి మంచి చేశారు. అంతే గాకుండా 45 ఏళ్లు నిండిన బడుగు, బలహీన వర్గాల మహిళకు వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75వేలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.

ముఖ్యంగా తొలి సంతకంతోనే పింఛన్లను పెంచారు. ఒంటరి మహిళలకు అన్నగా ఆలోచించి ఆర్థిక భరోసానిచ్చారు. అంతేకాకుండా ఉగాది రోజు ఇళ్లులేని ప్రతి మహిళ పేరున ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి మరీ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా నామినేటెడ్‌ పదవుల్లోనూ మహిళకే సగభాగం ఇస్తామని ప్రకటించడం మహిళాలోకం మరోవరంగా భావి స్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement