సాక్షి, కడప : జిల్లాలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ పోస్టులకు ఎంపికైన వారిలో 51 మందికి తగిన విద్యార్హతలు లేవని గుర్తించారు. వీరిని అనర్హులుగా అధికారులు ధ్రువీకరించారు. వీరు సంబంధంలేని డిగ్రీ కోర్సు సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. వాస్తవానికి ఈ పోస్టులకు బీఏ ఆర్ట్స్, హ్యుమనిటీస్ ఆపైన చదివిన వారు అర్హులుగా నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. బీకాం కూడా అర్ట్స్ గ్రూపే కదా అని కొందరు, ఏదైనా డిగ్రీ సరిపోతుందని మరికొందరు భావించి దరఖాస్తు చేశారు.
బీఎస్సీ, బీకామ్, ఎల్‌ఎల్‌బీ, బీటెక్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. ఫలితాల్లో మంచి మార్కులు సంపాదించడంతో నగరపాలక అధికారులు వీరిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశారు. అనంతపురం జిల్లాలో సంబంధం లేని డిగ్రీలు చేసిన వారు అర్హత పొందారని కొందరు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మన జిల్లాలో కూడా ఇలాంటి అనర్హులున్నారని తేలింది. ఫలితంగా 51 మంది నియామకాలను అధికారులు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన తప్పును సరిదిద్దేందుకు అ«ధికారులు నియామకపత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment