సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ): కరోనా కేసులతో ఆదివారం ఒక్కసారిగా కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. ఒక్కరోజే ఇక్కడ 49 కేసులు నమోదు కావడంతో జిల్లాలో హై–అలర్ట్ ప్రకటించారు. ఈ కేసులన్నీ ఢిల్లీ జమాతేకు వెళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా కేసులు 53కి చేరాయి. తాజా పరిణామాలతో రాష్ట్రంలోనే అత్యధిక కేసులున్న జిల్లా కూడా ఇదే. ఒక్కసారిగా జిల్లాలో కరోనా విజృంభణతో లాక్‌డౌన్ ఆంక్షలను ఇక్కడ మరింత కఠినతరం చేశారు.
రాష్ట్రంలో కొత్తగా 60 కేసులు
మరోవైపు.. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సా.5 గంటలు వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ఆదివారం ప్రకాశం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆదివారం వరకు నమోదైన కేసుల్లో 11 విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, వారి కాంటాక్టŠస్ ద్వారా ఆరుగురికి , మరో ఆరుగురు కరోనా లక్షణాలతో చేరినట్లు వైద్య శాఖ పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రంలో నమోదైన మొత్తం 252 కేసుల్లో 229 కేసులు ఢిల్లీ మూలాలు ఉన్నవారివే. కాగా, కరోనా కేసులు బయటపడుతున్న ప్రాంతాలపై రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి అక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించడమే కాకుండా, శానిటైజేషన్, బ్లీచింగ్ వంటి కార్యక్రమలను పెద్దఎత్తున చేపడుతోంది.
కరోనాను జయించిన మరో యువకుడు
– విజయవాడ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
కరోనా వైరస్‌ను జయించిన మరో యువకుడు ఆదివారం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. నగరంలోని వన్‌టౌన్‌కు చెందిన యువకుడు శనివారం డిశ్చార్జి కాగా.. గాయత్రి నగర్‌కు చెందిన మరో యువకుడు ఆదివారం డిశ్చార్జి అయ్యాడు. ఆమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే ఇతను మార్చి 22న నగరానికి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండటంతో మరుసటి రోజే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరగా పాజిటివ్ వచ్చింది. దీంతో 14 రోజులుగా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.
తాజాగా అతనికి నెగిటివ్ రావటంతో ఆదివారం డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పోతురాజు నాంచారయ్య, కోవిడ్–19 ట్రీట్‌మెంట్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. గోపిచంద్‌లు తెలిపారు. డిశ్చార్జి అయిన యువకుడిని కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి పూరిగా కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment