సిరిపురిపై సినిమా వాళ్లు కన్నుపడింది..సినీ అవకాశాలు, అధిక వడ్డీల ఆశ కల్పించారు. ఫైనాన్సియర్ల నుంచి రూ. కోట్లలో అప్పులు తీసుకొని తీర్చకుండా ‘సినిమా’ చూపిస్తున్నారు. ఓ బడా నిర్మాత ఏకంగా 66 చెక్‌బౌన్స్ కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అప్పులోల్ల నెత్తిన బండ మోపి తాపీగా సినీ షూటింగ్‌కు వచ్చినట్లు కోర్టుకు వచ్చి వెళుతున్నాడని బాధితులు వాపోతున్నారు.
ప్రొద్దుటూరు క్రైం : సిరిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు సినీ ఫైనాన్షియర్లకు కూడా ప్రసిద్ధి. ఇక్కడున్న పలువురు చాలా కాలం నుంచి సినీ నిర్మాతలకు పెట్టుబడికి గాను అప్పు ఇస్తున్నారు. మార్కెట్‌లో కంటే ఎక్కువ వడ్డీ వస్తుండటంతో ఎక్కువ మంది సినీ ఫైనాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సినీ ఫైనాన్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్‌లుగా ఉన్నారు. సినీ రంగంలోని వ్యక్తులకు గతంలో అప్పు ఇచ్చేవారు కొందరు మాత్రమే ఉండేవారు. అయితే లాభాలు బాగా వస్తుండటంతో ఇటీవల అప్పు ఇచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో హైదరాబాద్‌లోని పలువురు నిర్మాతలు ప్రొద్దుటూరుకు వచ్చి రూ. కోట్లలో అప్పు తీసుకొని వెళ్తున్నారు.
స్థానికంగా ఉన్న కొందరు మధ్య వర్తుల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ ఇచ్చే వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉండటం విశేషం. సుమారు 7 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఒక నిర్మాతకు ఇక్కడి ఫైనాన్షియర్లు రూ. కోట్లలో అప్పు ఇచ్చారు. అయితే అతను ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో రుణదాతలు కోర్టులో కేసు వేశారు. అతను డబ్బు ఇవ్వకపోవడంతో చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ సంఘటన మరచిపోక ముందే మరో సినీ నిర్మాత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సినీ నిర్మాత బండ్ల గణేష్‌బాబుకు ప్రొద్దుటూరుకు చెందిన అనేక మంది రూ. లక్షల్లో అప్పు ఇచ్చారు. అతను ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. చెక్‌బౌన్స్ కేసుకు బండ్లగణేష్ ప్రతి నెలా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరు అవుతున్నారు.
66 చెక్‌బౌన్స్ కేసులు
బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టుల్లో సుమారు 66 కేసులు ఉన్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 21, ఫస్ట్ ఏడీఎం కోర్టులో 66 చెక్ బౌన్స్‌లు నమోదు అవుతున్నాయి. ఫైనాన్షియర్లు ఇచ్చిన డబ్బుకు గాను ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లక పోవడంతో వారందరూ 2017లో కోర్టును ఆశ్రయించారు. నిర్మాత బండ్ల గణేష్‌బాబు పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పేరుపై ప్రొద్దుటూరులో అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి అతను రూ. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. 66 మందికి సంబంధించి బౌన్స్ అయిన చెక్కుల విలువ సుమారు రూ.8 కోట్ల వరకు ఉంటుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ ఐదు సార్లు నిర్మాత బండ్ల గణేష్ వాయిదా నిమిత్తం ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. అయితే ఈ నెల 18న 35 కేసులకు సంబంధించిన చెక్‌బౌన్స్ కేసులో బండ్లగణేష్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అతను రాలేదు. తిరిగి ఈ కేసును నవంబర్ నెలకు కోర్టు వాయిదా వేసింది.
అదో రంగుల ప్రపంచం..
సినిమా హీరోలు, హీరోయిన్‌లు ఎప్పుడైనా మన ప్రాంతానికి వస్తే వారిని చూడటానికి ఎగబడి పోతారు. ఎంత కష్టమైనా సరే వాళ్లను ఒక్కసారైనా కళ్లారా చూడాలని పరితపిస్తారు. అలాంటిది హీరోలు, హీరోయిన్‌లను దగ్గరగా చూసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్‌లకు ఫైనాన్షియర్లకు ఆహ్వానాలను పంపిస్తారు. వీరికి హీరోలు, హీరోయిన్‌లతో కలసి ఫొటోలు తీసుకోవడం, భోజనం చేసే అవకాశాలు కూడా లభిస్తుంటాయి. బాగా పేరున్న ఫైనాన్షియర్లకు కొత్త సినిమా ప్రీమియర్ షోకు వెళ్లే ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఎక్కువ వడ్డీతో పాటు చిత్ర పరిశ్రమలోని అనేక మంది సెలెబ్రెటీలు పరిచయం అయ్యే అవకాశాలు ఉండటంతో కొంత మంది ఈ కారణంతో పెట్టుబడులు పెడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నిర్మాత బండ్ల గణేష్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు రావాల్సి ఉండటంతో వస్తుందో రాదో అని బాధితులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment