వ్యవసాయానికి రెండు విడతలుగా 7గంటల విద్యుత్ | 7 hours power to farmers in two intervals | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి రెండు విడతలుగా 7గంటల విద్యుత్

Published Sat, Sep 21 2013 2:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

7 hours power to farmers in two intervals


 మిర్యాలగూడ, న్యూస్‌లైన్
 వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్‌కో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ ఫీడర్ నుంచి ఎన్ని గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతుందనే విషయం తెలుసుకోవడానికి సబ్‌స్టేషన్‌లలోని ఫీడర్లకు ఎంఆర్‌ఐ (మీటర్ రీడింగ్ ఇన్‌స్ట్రమెంట్) అమర్చారు. ఎంఆర్‌ఐ సహాయంతో ఏ రోజు ఎన్ని గంటలు వ్యవసాయానికి సరఫరా చేశారనే విషయం తెలిసిపోతుంది. దాంతో రైతుల నుంచి ఎదురయ్యే విమర్శలతో పాటు సబ్‌స్టేషన్లలోని ఆపరేటర్ల అవకతవకలకు కూడా చెక్ పడే అవకాశాలున్నాయి. ఎంఆర్‌ఐతో సుమారు 40 రోజులకు సంబంధించిన విద్యుత్ సరఫరా వివరాలను ఒకేసారి కంప్యూటర్ సహాయంతో పరిశీలించుకునే అవకాశం ఉంది. జిల్లాలో 728 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లకు ఎంఆర్‌ఐ మిషన్లను అమర్చారు. గతంలోనే ఈ మిషన్లు అమర్చినా వాటి ద్వారా వచ్చే వివరాలు సేకరించలేదు. కానీ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో పుష్కలంగా విద్యుదుత్పత్తి అవుతున్నా 7 గంటల పాటు సరఫరా కావడం లేదని విమర్శలు రావడంతో రీడింగ్ పద్ధతి అమలు చేస్తున్నారు.
 
 రోజుకు 17మి.యూ. విద్యుత్ వినియోగం
 జిల్లాలో రోజుకు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. 3,05,498 వ్యవసాయ
 విద్యుత్ కనెక్షన్లుండగా గృహ వినియోగదారులు కనెక్షన్లు 7,37,298ు ఉన్నాయి. వాటితో పాటు 11వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 780 భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికీ 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది.
 
 రెండు విడతలుగా సరఫరా
 వ్యవసాయానికి రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ కనెక్షన్లను రెండు గ్రూపులుగా విభజించి వాటికి రెండు విడతలుగా సరఫరా చేస్తున్నారు. (ఎ) గ్రూపులో వారికి రాత్రి 9గంటల నుంచి 12 వరకు 3 గంటలపాటు, ఉదయం 6  నుంచి 10గంటల వరకు 4 గం టల పాటు, (బి) గ్రూపు వారికి రాత్రి 12 గంటల నుంచి 3గంటల వరకు 3గంటల పాటు, ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు 4 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
 చేతులు దులుపుకునే ప్రయత్నం
 వ్యవసాయానికి సబ్‌స్టేషన్లలో ఉండే ఫీడర్‌కు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసి ట్రాన్స్‌కో అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫీడర్ నుంచి సంబంధిత ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరా కాగానే ఓవర్ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్ ట్రిప్ అవుతుంది. అలా అయితే వారికి ఎలాంటి సంబంధమూ లేదు. ఫీడర్‌కు సరఫరా అయ్యే సమయాన్ని మాత్రమే లెక్కగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్రాన్స్ ఫార్మర్‌పై అనుమతి లేని మోటార్లను తొలగిం చడంతో పాటు అధిక మోటార్లు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను మం జూరు చేసి ఓవర్ లోడ్ తగ్గించాల్సిన బాధ్యత కూడా ట్రాన్స్‌కో అధికారులపై ఉంది. అలా చేయకపోవడంతో ఫీడర్ వద్ద సరఫరా చేసినా ఓవర్‌లోడ్ కారణంగా కొన్ని చోట్ల రైతులకు 7గంటల విద్యుత్ సరఫరా కావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement