ఈరోజు రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు.
హైదరాబాద్: ఈరోజు రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు, తండ్రి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనుమానపు భర్తల వల్ల ఇద్దరు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. తమ భర్తలు అనుమానించడంతో మనస్తాపంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కందిచెరువులో దూకి తండ్రి,ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య చేసుకున్నారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్‌రోడ్డులో ఓ గుర్తు తెలియని యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.