ఎందరో ‘ఎర్ర’కూలీలు
సాక్షి, చిత్తూరు:
ఎంతమందిని అరెస్ట్ చేసినా పుట్టలోని చీమల్లా ఎర్రచందనం కూలీలు శేషాచల అడవుల్లోకి వస్తూనే ఉన్నారు. వడమాలపేట వద్ద 76 మంది కూలీలు మంగళవారం రాత్రి పట్టుబడడమే దీనికి నిదర్శనం. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఉపాధి సరిగా లేకపోవడం, కూలి బాగా గిట్టుబాటు కావడం, చట్టంలో కఠిన శిక్షలు లేకపోవడం తదితర కారణాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడం కష్టంగా మారింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు పరిసర గ్రామాల్లోనూ, తిరువళ్లూరు, చెన్నై, కర్ణాటక, బెంగళూరులోనూ స్మగ్లర్లు తిష్టవేసి ఉన్నారు. వీళ్లు తమిళనాడు జిల్లాల్లోని పేదగ్రామాల ప్రజలను గుర్తించి ఒక్కొక్కరికీ లక్ష నుంచి మూడు లక్షల వరకు అడ్వాన్స్‌లు ఇస్తారు. అడవిలోకి చేరేందుకు ప్రత్యేక వాహన సదుపాయం, తిండి సమకూరుస్తున్నారు.
ఎర్రచందనం నరికే కూలీలు తిరువణ్ణామలై, వేలూరు, తిరువళ్లూరు, కంచి, సేలం, క్రిష్ణగిరి, ధర్మపురి జిల్లాల నుంచి వస్తున్నారు. ఒక ఎర్రచందనం దుంగ నరికితే రూ.1,500 వరకు గిట్టుబాటు అవుతుండడంతో కూలీలు కేసులు పెట్టించుకునేందుకు కూడా సిద్ధపడి శేషాచల అడవుల్లోకి వస్తున్నారు. దుంగలు నరికి నిర్ణీత ప్రాంతానికి చేర్చడం వరకే వీళ్ల పని. మిగతా పని అంచెలవారీగా పూర్తవుతుంది. సీ.ఎం నియోజకవర్గం పీలేరు కూడా ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా ఉంది. ఇక్కడ కొందరు చోటమోటా నాయకులు ఎర్రచందనం అక్రమరవాణాతో కోట్లు గడించి రాజకీయల్లో కూడా హల్‌చల్ చేస్తున్నారు. వీరిలో ఒకరిద్దరికి అధికారపార్టీనాయకుల అండదండలు కూడా ఉన్నాయి. నరికేందుకు వచ్చి కూలీలు పట్టుబడినా ఎపీ అటవీశాఖ చట్టం సెక్షన్ 20(1) డీ కింద నేరం రుజువు అయితే మూడు నెలల నుంచి ఒక సంవత్సరంలోపే జైలు శిక్ష పడుతుంది. బెయిల్ కూడా వెంటనే లభిస్తుంది. దీనితో స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగానే ఆదాయం కోసం స్వల్పకాలిక శిక్షలను లెక్కచేయకుండా మళ్ళీమళ్ళీ శేషాచలం కొండల్లో ఉన్న ఎర్రచందనం వక్షాలను యథేచ్చగా నరికేస్తున్నారు. రాష్ట్ర అటవీ పరిరక్షణ చట్టాన్ని సవరించి ఎర్రచందనం స్మగ్లర్లకు కనీసం ఐదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించేలా చేస్తే స్మగ్లింగ్ కొంత వరకు తగ్గేఅవకాశం ఉంది.
కాగా 2001 నుంచి ఎర్రచందనం అక్రమరవాణా పెరుగుతూ వచ్చింది. ప్రారంభంలో పరిమిత సంఖ్యలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా ఇప్పుడు ఏకంగా వందల సంఖ్యలో దుంగలు లారీలు, వ్యాన్లు, కూరగాయల రవాణా ఆటోలు, బ్రాండ్‌న్యూకార్లు ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహానానికి నకిలీ నెంబరు ప్లేట్ తగిలించి వినియోగిస్తున్నారు. 2006లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు 3 నమోదు కాగా, ఈ సంఖ్య 2010లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 154కు చేరింది. 4.5 కోట్ల ఎర్రచందనం సీజ్‌చేశారు. 2013లో ఇప్పటికే 15 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 500 టన్నుల ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు. వెయ్యిమందికిపైగా ఎర్రచందనం నరికేవారిని, ఇందులో 50 మంది రెండవ శ్రేణి స్మగ్లర్లను అరెస్టు చేసి జైలుకు పంపారు.