కాల్పుల మోత | Crash fire | Sakshi
Sakshi News home page

కాల్పుల మోత

Published Thu, Aug 7 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

Crash fire

ఓబులవారిపల్లె: శేషాచలం అడవుల్లో బుధవారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. స్పెషల్‌పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఇరువురు ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లోని నీచుగుంత ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్నట్లు సమచారం అందడంతో స్పెషల్‌బ్రాంచ్ ఎస్‌ఐ రమేష్‌బాబు స్పెషల్‌పార్టీ పోలీసులను అప్రమత్తం చేశారు.
 
 జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఉదయం 6 గంటల ప్రాంతంలో నీచుగుంత ప్రాంతంలో కూంబింగ్‌కు దిగారు. చెట్లు నరుకుతున్న శబ్ధాలు గ్రహించిన ఆర్‌ఎస్‌ఐ రాజు  సాయుధబలగాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే  ఎర్రకూలీలు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు వారి దాడులను ప్రతిఘటించారు. ఎర్రకూలీలు జరిపిన దాడిలో ఇరువురు కానిస్టేబుళ్లు స్వల్పంగా గాయపడటంతో ఆత్మ రక్షణ కోసం గాల్లో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా ఎర్రకూలీలు దాడులను ఆపలేదు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
 
 ఎర్రచందనం తరలింపునకు అడ్డాగా నీచుగుంత:
 ఎన్‌కౌంటర్ జరిగిన పరిసరాలను  గమనిస్తే ఎర్రచందనం స్మగ్లింగుకు నీచుగుంత అడ్డాగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్‌కౌంటర్ స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నీచుగుంత ప్రాంతం గాదెల అటవీప్రాంతానికి చాలా దూరంలో ఉంది. ఎత్తయిన కొండ ఎక్కి లోతైనదిగువ ప్రాంతానికి వెళ్ళాలి. నీటి సౌకర్యం ఉండటంతో పాటు వంటకు, రాత్రుల్లో ఉండేందుకు అనువుగా ఉంది. ఈ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి.
 
 దీంతో ఈ ప్రాంతాన్ని అడ్డాగా ఎంచుకుని ఎర్రచందనం స్మగ్లర్లు కూలీల చేత చెట్లను నరికించి దుంగలను తరలించుకుపోతున్నారు. నీచుగుంత ప్రాంతం అంతా నిత్యావసర వస్తువుల ప్యాకెట్లు, కూలీలకు అవసరమయ్యే ఇతర వస్తువులతో నిండిపోయి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో ఎర్రచందనం కూలీలు అనేక రోజులుగా అక్కడే ఉంటున్నట్లు ఘటనాస్థలాన్ని సందర్శించిన రాజంపేట డీఎస్పీ జీవీ రమణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కూంబింగ్ నిర్వహించే ప్రత్యేక పోలీసు బృందాలుగానీ, అటవీశాఖ అధికారులు కానీ ఈ ప్రాంతంలో సంచరించిన దాఖలాలు ఉంటే ఎర్రచందనం కూలీలుగానీ, స్మగ్లర్లు కానీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో సుమారు 50 గొడ్డళ్లు, అక్కడక్కడా నరికివేసిన ఎర్రచందనం దుంగలు, బియ్యం, బీడీలు, అగ్గిపెట్టెలు  తదితర వస్తువులను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం కూలీల సంచులను తనిఖీ చేయగా గత నెల 11, 30 తేదీల్లో గుత్తి నుంచి తిరుపతికి కొన్న రైలు టిక్కెట్లు లభించాయి.
 
 తమిళ తంబీల కోసం తనిఖీలు
 రాజంపేట: శేషాచలంలోని గాదెల అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఎర్ర కూలీల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. సుమారు 50 మంది కూలీలు తప్పించుకుని పోయినట్లు పోలీసులు  భావిస్తున్నారు.  ఇందులో భాగంగా రూరల్ సీఐ వై.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రామాపురం వద్ద వాహనాల తనిఖీ చేశారు. లారీలు, బస్సులు, ఆటోలతో పాటు వివిధ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అనుమానం వచ్చిన వారి గురించి ఆరా తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement