6 ఖాళీలకు 8 మంది పోటీ
ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒకరు టీఆర్‌ఎస్
రెబెల్స్‌గా బరిలో దిగుతున్న జేసీ, చైతన్య రాజు
కేవీపీ, టీఎస్సార్, ఖాన్‌లకే మళ్లీ అవకాశం
నేడు నామినేషన్లు.. 31 దాకా ఉపసంహరణ
రెబల్స్‌ను తప్పించేందుకు రంగంలోకి అధిష్టానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారింది. మొత్తం 6 స్థానాలు ఖాళీ అవుతుండగా వాటికోసం 8 మంది అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తరపున ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్‌ఎస్ నుంచి ఒక్కరు పోటీ చేస్తుండగా... మరో ఇద్దరు సమైక్యవాదం పేరుతో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేశవరావు పేరును ఆదివారం సాయంత్రమే ప్రకటించడం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ పేర్లు సోమవారం సాయంత్రం ఖరారయ్యాయి.
టీడీపీ నుంచి గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి పేర్లను రాత్రి సమయంలో చంద్రబాబు ఖరారు చేశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి, ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) రెబల్స్‌గా బరిలో దిగుతున్నారు. నామినే షన్ల దాఖలుకు మంగళవారమే చివరి రోజు. 8 మంది అభ్యర్థులూ అదే రోజున నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. వారంతా ఇప్పటికే ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన అఫిడవిట్లను సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 31వ తేదీ దాకా మూడు రోజులు గడువుంటుంది.
ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ మొండిచేయి
కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు మొండిచేయి చూపింది. పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీల్లో నంది ఎల్లయ్య ఎస్సీ కాగా రత్నాబాయి ఎస్టీ. రాష్ట్ర విభజన నిర్ణయంపై గుర్రుగా ఉన్న పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించడంతో ఆందోళన చెందిన అధిష్టానం ముగ్గురు అభ్యర్థులతోనే జాబితా విడుదల చేసింది. వారిలో టి.సుబ్బరామిరెడ్డి పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత. ఆయనను రాజ్యసభకు పంపుతుండటంతో కేంద్ర మంత్రి పురందేశ్వరికి విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి ఆటంకాలు తొలగినట్టయింది. కేవీపీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్తల్లో ఒకరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. వారిని తనకు అనుకూలంగా మార్చుకోగలరనే భావనతోనే కేవీపీని తిరిగి బరిలో దింపినట్టు తెలుస్తోంది.
కేవీపీ ఖరారుతో తప్పుకున్న వట్టి, ఉండవల్లి
సమైక్యవాద ప్రతినిధులుగా రాజ్యసభ బరిలో దిగాలని భావించిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, వట్టి వసంతకుమార్, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి చివరికి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కేవీపీకి టికెటివ్వడంతో ఆయన సన్నిహితులైన వట్టి, ఉండవల్లి తప్పుకున్నారు.
రాష్ట్రానికి తిరునావుక్కరసు, కుంతియా
రెబెల్ అభ్యర్థుల అంశం, సీమాంధ్ర ఎమ్మెల్యేల ఆగ్రహావేశాలు కాంగ్రెస్ పెద్దలను కలవరపరుస్తున్నాయి. రెబల్స్‌ను తప్పించేందుకు, ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారు రంగంలోకి దిగారు. ఏఐసీసీ పరిశీలకులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్‌చార్జులు తిరునావుక్కరసు, ఆర్‌సీ కుంతియా ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు. వారు సోమవారం సాయంత్రం నుంచి సీఎం, పీసీసీ చీఫ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కేవీపీ రామచంద్రరావు
పుట్టిన తేదీ: జూన్ 21, 1948;
స్వస్థలం: కృష్ణాజిల్లా అంబాపురం; విద్యార్హత: ఎంబీబీఎస్.
పదవులు : 2004 మే నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశారు. 2008 ఏప్రిల్‌లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యూరు. వ్యవసాయ శాఖ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఎంఏ ఖాన్
పుట్టిన తేదీ : జనవరి 1, 1948;
స్వస్థలం: నిజామాబాద్ జిల్లా రుద్రూర్; విద్యార్హత : 10వ తరగతి
పదవులు: ఏప్రిల్ 2008 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా 13 ఏళ్ల పాటు కొనసాగారు. ఆంధ్రాబ్యాంక్ డైరక్టర్‌గా, సెట్విన్ చైర్మన్‌గా పనిచేశారు.
టి. సుబ్బరామిరెడ్డి
పుట్టిన తేదీ: సెప్టెంబర్ 17, 1943;
స్వస్థలం: నెల్లూరు; విద్యార్హత: బీకాం
పదవులు: 1996, 1998 ఎన్నికలలో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2002లో ఒకసారి, 2008లో మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పనిచేశారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఇటీవలే నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు.
రాజ్యసభ పోరు రసవత్తరం
Published Tue, Jan 28 2014 2:21 AM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM
Advertisement
Advertisement