దటీజ్ దేవిశ్రీప్రసాద్
తిరుపతి: నగరానికి చెందిన దేవిశ్రీప్రసాద్ (8) లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్థానిక ఓ ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి చదువుతున్న అతను స్కేటింగ్ శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వేదిక్ యూనివర్సిటీ వద్ద 103.7 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన 50 సుమో వాహనాల కింద 8.5 ఇంచ్‌ల ఎత్తులో ముందుకు(ఫార్వర్డ్) స్కేటింగ్ చేస్తూ, కేవలం 19.27 సెకండ్లలో గత ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు.
గతంలో తమిళనాడుకు చెందిన ఐజెక్ హెండ్రీ అనే క్రీడాకారుడు 102 మీటర్ల దూరం లో ఏర్పాటు చేసిన 42 సుమోల కింద ముందుకు(ఫార్వర్డ్) 27.4 సెకండ్లలో ఈ రికార్డు సాధించగా దేవిశ్రీప్రసాద్ అధిగమించాడు. ఇదే స్కేటింగ్‌లోనే వెనక్కి(బ్యాక్‌వర్డ్) 53.8 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన 26 సుమోల కింద 27.98 సెకండ్లలో చేరుకుని సత్తా చూపాడు. ఈ వీడియో రికార్డులను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ల పరిశీలనకు పంపనున్నారు. ప్రపంచ రికార్డుతో ఒకే రోజూ ఏడు సంస్థల గుర్తింపు పొందిన దేవిశ్రీప్రసాద్‌కి ప్రతిష్టాత్మకమైన ‘మ్యాన్ ఆఫ్ ది రికార్డు-2015’ అవార్డును ప్రకటించారు.