నీటి మూటలు ! | 9 water grids in districts.. | Sakshi
Sakshi News home page

నీటి మూటలు !

Published Sat, Dec 27 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

9 water grids in districts..

జిల్లాలో తొమ్మిది వాటర్ గ్రిడ్‌లను నిర్మించి, నీటి ఎద్దడి తీర్చాలని భావిస్తున్న సర్కార్ వాస్తవ పరిస్థితులను విస్మరిస్తోంది. నీటి లభ్యత, నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పరిశీలిస్తే ఇది ఎంతవరకు సాధ్యమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి విభాగం నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో ప్రస్తుతం  నిర్మాణంలో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను నిలిపివేసిన ప్రభుత్వం,  భారీ ఖర్చుతో వాటర్ గ్రిడ్‌లను ఎలా నిర్మిస్తుందన్న సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యమయ్యే మార్గాలను కాలదన్ని, గాలిలో మేడలు కడుతున్నారని, జిల్లాలో నీటి లభ్యత, వాటర్ గ్రిడ్‌ల నిర్మాణానికి అయ్యే ఖర్చు వివరాలను పరిశీలిస్తే వాస్తవపరిస్థితులు అర్థమవుతాయని అభిప్రాయపడుతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో 2945 హేబిటేషన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికీ జాతీయ గ్రామీణాభివృద్ధి మంచినీటి కార్యక్రమం నిబంధనల కింద  ప్రతీ రోజూ 55 లీటర్లు అందజేయాలి. ఈ లెక్కన ప్రస్తుతం జిల్లాలో 1089 హేబిటేషన్లలో మాత్రమే రక్షిత మంచినీరు అందించగలుగుతున్నారు. మిగతా హేబిటేషన్ల విషయానికి వస్తే... 684 హేబిటేషన్లలో ఒక్కొక్కరికీ 30 నుంచి 40 లీటర్లు,  406 హేబిటేషన్లలో 20 నుంచి 30 లీటర్లు, 387 హేబిటేషన్లలో 10 నుంచి 20 లీటర్లు, 293 హేబిటేషన్లలో 10 లీటర్ల లోపే సమకూర్చగలుగుతున్నారు.   

86 గ్రామాల్లో కనీసం లీటర్ రక్షిత మంచినీటిని కూడా అందించలేని  పరిస్థితులున్నాయి. ఈ లెక్కన జిల్లాలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలో 16 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో ఎనిమిది పథకాల  పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పదుల సంఖ్యలో మంజూరు దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కొంతమేర తాగునీటి సమస్య తీరుతుంది. ఈ పనులకు రూ.300 కోట్లు అవసరం ఉంది.  కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

నిర్మాణ దశలో ప్రాజెక్టులకు నిధులు నిలిపేసింది. ప్రారంభం కాని పనుల్ని ఆపేయాలని ఆదేశాలిచ్చింది. మంజూరు దశలో ఉన్న వాటి ఊసెత్తడం లేదు. దీని కంతటికీ నిధుల సమస్యే కారణమని సర్కార్ పరోక్షంగా చెబుతోంది.     ఈ మార్గాన్ని వదిలేసి సర్కార్ ప్రస్తుతం ఆచరణ సాధ్యం కాని వాటర్ గ్రిడ్‌లపై దృష్టి సారించింది. జిల్లాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ రోజుకి 150 లీటర్ల చొప్పున, పరిశ్రమలకు 15 శాతం నీరందించేందుకు గాను రూ.3,750 కోట్లతో తొమ్మిది వాటర్ గ్రిడ్‌లకు ప్రతిపాదనలు రూపొందించింది.

రిజర్వాయర్ల  ద్వారా నీటిని సంపులు, పైపులైన్ల ద్వారా గ్రామాలకు అందించాలన్నదే వాటర్ గ్రిడ్‌ల లక్ష్యం. కాకపోతే అందుకు తగ్గ నీటి వనరులెక్కడున్నాయన్నది డాలర్ల ప్రశ్న. జిల్లాలో ప్రస్తుతం 10 రిజర్వాయర్లున్నాయి.  వీటిలో 18 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ఇందులో 16 టీఎంసీలు ఇరిగేషన్‌కు విడుదుల చేస్తుండగా... కేవలం రెం డు టీఎంసీలను మాత్రమే ప్రస్తుతం తాగునీటి కింద విడుదల చేస్తున్నారు. అదే తొమ్మిది వాటర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేయాలంటే 16 టీఎంసీల నీరు లభ్యం కావల్సి ఉంది.

ఈ లెక్కన మరో 14టీఎంసీల నీరు అదనంగా తాగునీటి కోసం కేటాయిం చాల్సి ఉంది. ఆ మేరకు నీటి వనరులెక్కడ ఉన్నాయన్నదే ప్రశ్న. అంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తే తప్ప వాటర్ గ్రిడ్స్ యోచన అమలయ్యే పరిస్థితి లేదు.   ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకే సర్కార్ నిధులు కేటాయించడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. వీటికే దిక్కులేనప్పుడు కొత్త వాటి కోసం ఆలోచించడం అత్యాశే అవుతుంది. లేదంటే పోలవరం ప్రాజెక్టు నీరు తీసుకురావల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తయితేనే మార్గం సుగమమవుతుంది.  

నీటి లభ్యత అన్నది ఒక సమస్యైతే వాటర్ గ్రిడ్‌ల కోసం రూ.3,750కోట్లు ఖర్చు పెట్టడమనేది మరో సమస్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత పెద్ద  మొత్తంలో ఖర్చు పెట్టగలదా అనేది సర్కార్‌కే ఎరుక. అటు నీటి వనరులు, ఇటు నిధులు సమకూర్చుకోవడంపై ఆలోచన చేయకుండా తొమ్మిది వాటర్‌గ్రిడ్‌ల ప్రతిపాదన ప్రణాళిక ఎలా తయారు చేశారన్నది అంతుచిక్కడం లేదు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ముందుకొస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగే అవకాశం లేదు.  అంతవరకైనా రక్షిత మంచినీటి పథకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement