గురుకులంలో కలకలం
కలుషితాహారం తిన్న 90 మంది విద్యార్థులకు అస్వస్థత
మోపిదేవిలో ఘటన
తల్లిదండ్రుల్లో ఆందోళన
ప్రాణాపాయం లేదన్న డీఎంహెచ్‌వో
మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ల పరామర్శ
‘బాబూ ఎలా ఉన్నావు..అసలేం జరిగింది’ ఓ తల్లి ఆవేదన. నాన్న నీకేం కాదురా కన్నా... బాధపడకు మరో తండ్రి ఓదార్పు..ఇవీ మోపిదేవి గురుకుల పాఠశాలలో గురువారం కనిపించిన దృశ్యాలు. ఫుడ్ పాయిజన్‌తో 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని టీవీ చానల్స్ ద్వారా తెలుసుకున్న మూడు జిల్లాల్లో ఉన్న తల్లిదండ్రులు హుటాహుటిన మోపిదేవికి పరుగులు తీశారు. పాఠాలు చదువుకునే గదుల్లోని బల్లలపైనే సెలైన్స్ ఎక్కించుకుంటున్న పిల్లలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మంచి విద్య అందిస్తారని పాఠశాలకు పంపితే అధికారుల నిర్లక్ష్యం తమ చిన్నారుల ప్రాణాలమీదకు తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోపిదేవి : స్థానిక గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్‌తో 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా అందులో 24 మందికి సెలైన్లు ఎక్కిస్తున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు టీవీల ద్వారా విషయం తెలుసుకొని పాఠశాలకు వచ్చారు. శాసనసభ ఉపసభాపతి విద్యార్థులను పరామర్శించి, వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని వైద్యాధికారులంతా చిన్నారుల వైద్యసేవల్లో నిమగ్నమయ్యారు. బుధవారం రాత్రి భోజనంలో గుడ్డు, సాంబారు తీసుకోవడంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని డీఎంహెచ్‌వో డాక్టర్ నాగమల్లేశ్వరి తెలిపారు. ఆహారంతో పాటు మంచినీరు వల్ల కూడా బ్యాక్టీరియా వ్యాపించవచ్చునని, వాటర్‌ను టెస్టింగ్ కోసం పంపుతున్నామన్నారు. నియోజకవర్గంలోని పీహెచ్‌సీ డాక్టర్స్, సిబ్బంది అంతాపాఠశాలలోనేవిద్యార్థులకువైద్యసేవలందిస్తున్నారన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. పాఠశాల గదులు ఇరుకుగా ఉండడంతో అందరికీ బెడ్స్‌తోపాటు ఫ్యాన్లు కూడా ఏర్పాటుచేస్తున్నామన్నారు.
తెల్లవారు జామునుంచే వాంతులు, విరేచనాలు
గురువారం తెల్లవారు జామునుంచే వాంతులు, విరేచనాలు అవ్వడంతో డెప్యూటీ వార్డెన్‌కు చెప్పామని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలిపారు. కొన్ని మందులు ఇచ్చారని అవి వేసుకున్నా తగ్గలేదని చెప్పారు. డెప్యూటీ వార్డెన్ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పడంతో ఆయన వైద్య సిబ్బందిని పాఠశాలకు పంపారన్నారు. బెడ్‌లు లేకపోవడంతో సెలైన్లు ఎక్కించుకోవడానికి బల్లలపై పడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన చెందాం : తల్లిదండ్రులు
ఒకేసారి 90 మందికి ఫుడ్‌పాయిజన్ జరిగిందని తెలుసుకుని భయపడిపోయాం. పిల్లలను చూసుకునే వరకు కాళ్లు, చేతులు ఆడలేదు. భగవంతుని దయవల్ల ప్రాణాపాయం లేదని సంతోషించాం. వాటల్ ట్యాంకు శుభ్రం చేసేకంటే ఎప్పుడో వేసిన వాటర్ పైపులు తొలగించి కొత్తవి వేయాలని పలుమార్లు కోరినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగింది.