ఏ క్లాస్ స్టేషన్‌గా అనకాపల్లి | A Class station Anakapalle | Sakshi
Sakshi News home page

ఏ క్లాస్ స్టేషన్‌గా అనకాపల్లి

Published Wed, Dec 23 2015 12:14 AM | Last Updated on Mon, May 28 2018 4:20 PM

A Class station Anakapalle

పూర్తిస్థాయిలో ఒకటో నంబరు ప్లాట్‌ఫారం అభివృద్ధి
పెండింగ్ పనుల పూర్తికి చర్యలు
ఇకనుంచి ఎల్‌ఈడీ వెలుగులు
సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యం
దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా

 
అనకాపల్లి రూరల్ (మునగపాక): గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను ఏ క్లాస్ స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే   జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫారం, బుకింగ్ కౌంటర్, ట్రైన్ల సమాచారం బోర్డులను పరిశీలించారు.  రైల్వే కాలనీలో చిన్న పిల్లల పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన రైల్వే ఐజీ సంజయ్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కాలనీలోని ఇళ్లను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. కొంతకాలంగా డ్రైనేజీ సమస్యతో సతమతం అవుతున్నామని, తాగునీరు రుచికరంగా ఉండటం లేదని మహిళలు వివరించారు. రెండో నంబరు ప్లాట్‌ఫారంలో సోలార్ లైటింగ్ సిస్టమ్‌ను జీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫారం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తిస్థాయిలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధిచేస్తామని, దీనిలో భాగంగా పెండింగ్‌లోని పనులను పూర్తిచేస్తామని చెప్పారు. ప్రయాణికులకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.  ఆయన వెంట విజయవాడ డీఆర్‌ఎం అశోక్‌కుమార్, హెచ్‌వోడీలు గజాసన్, డి.కె.సింగ్, మల్లయ్య, ఉషాకేమద్దాలి, బ్రహ్మానందరెడ్డి, డీజీఎం నీలకంఠరెడ్డి, సీపీవో ఆర్.ఆర్.ప్రసాద్, సీఎంఈ కబీర్ అహ్మద్, ఆర్‌సీ భూలోకనందిని, సీఎస్‌వో సాహా, సీఎస్‌ఈసీ సంజయ్ శంకర్, సీసీఎం లక్ష్మినారాయణ, సీఈ ఎస్.ఎల్.సింగ్, కమిషనర్ గాంధీ, స్టేషన్ సూపరింటెండెంట్ పార్థసారథి పాల్గొన్నారు.
 
విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలంటూ నిరసన ...
విశాఖను రైల్వేజోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ప్రజాసంఘాలు, అఖిలపక్ష రాజకీయ నాయకులు కనిశెట్టి సురేష్, జాజుల రమేష్, మామిడి నూకరాజు తదితరులు జీఎం గుప్తా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆశగా చూపిస్తున్న జోన్‌ను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
పాయకరావుపేట: విద్యుత్ ఆదాలో భాగంగా రైల్వేస్టేషన్లలో ఎల్‌ఈడీ బల్బుల వినియోగాన్ని త్వరలోనే అమలుచేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా అన్నారు. మంగళవారం ఆయన వార్షిక తనిఖీల్లో భాగంగా తుని రైల్వేస్టేషన్, పాయకరావుపేట రైల్వే ట్రాక్, గేట్లు, ఆసుపత్రులు, నీటి సరఫరాను పరిశీలించారు.  ప్రయాణికుల వసతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తునిలో సోలార్ విద్యుత్‌తో పనిచేసే మంచినీటి పథకాన్ని ప్రారంభించామన్నారు. రైల్వేస్టేషన్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
 
వినతుల వెల్లువ
నాలుగు నియోజకవర్గాలకు ప్రధాన రైల్వేస్టేషన్‌గా ఉన్న తునిలో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు హాల్ట్ కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంకిపాటి జమీల్, గున్నంరాజు, పి. తిరుపతయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు జీఎంకు వినతిపత్రం అందజేశారు. విశాఖ -ఢిల్లీ స్వర్ణజయంతి, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నామా, విశాఖ-ముంబాయి లోకమాన్య తిలక్, యశ్వంత్‌పూర్- పూరీ సూపర్ పాస్ట్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరారు. రెండో నంబరు ప్లాట్‌ఫారంపై టికెట్ కౌంటర్, కొండవారిపేట అండ ర్ పాస్ విస్తరణ, రైల్వే బంటాళ్లు పూడ్చి వేత, పుట్‌పాత్ వంతెన నిర్మాణం తదితర వాటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement