కేక్‌లా కట్‌చేసి ప్యాకేజీలా..?
సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి జైరాం రమేష్‌పై పారిశ్రామికవేత్తల ఆగ్రహావేశాలు
సాక్షి, విశాఖపట్నం: ‘‘రాష్ట్రాన్ని కేక్‌లా కట్‌చేశారు.. ఇప్పుడేమో అభివృద్ధి, ప్యాకేజీలంటూ గొప్పలు చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో మీరు ఓడిపోతే మాకు దిక్కెవరు? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి’’ అని పలువురు పారిశ్రామికవేత్తలు కేంద్రమంత్రి జైరాం రమేష్‌ను నిలదీశారు. విశాఖపట్నంలో సోమవారం జరిగిన సీఐఐ సదస్సులో మంత్రిని పారిశ్రామికవేత్తలు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సీమాంధ్ర గురించి మీకేం తెలుసు.. ఎందుకు విభజించారని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారు.. ఇప్పుడేమో ప్రత్యేక హోదా.. ప్యాకేజీలంటున్నారు.. అసలు మీరు మళ్లీ అధికారంలోకి రాకపోతే మా భవిష్యత్ ఏమిటి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ హామీలను అమలుపరుస్తుందన్న గ్యారంటీ ఏమిటి? అని వరుస ప్రశ్నలు సంధించారు.
పారిశ్రామికవేత్త ఆర్‌వీఎస్ రాజు ప్రత్యేక హోదా పదేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల ప్రతినిధి ఓ.నరేష్‌కుమార్ మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధి చెంది, కొత్త రాజధాని వచ్చేవరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తేదీని వాయిదా వేయాలని కోరారు. అనంతరం ప్రసంగించిన ఆయన తెలంగాణ డిమాండ్ ఎప్పటిదోనని, ఒకప్పుడు సీమాంధ్రవాసులు కూడా జైఆంధ్ర ఉద్యమం చేశారు కదా? అని ప్రశ్నించారు. దీంతో పారిశ్రామికవేత్తలంతా ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేసి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. వారిని మై ఫ్రెండ్స్ అంటూ శాంతపరిచేలా ప్రసంగించారు.
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన
కేంద్రమంత్రి జైరాం రమేష్ పర్యటనకు నిరసనగా వైస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. జైరాం రమేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రం ముక్కలైనా సీఐఐ ఒక్కటిగానే ఉండాలి: జైరాం రమేష్
రాష్ట్ర విభజన నిర్ణయం బాధాకరమేనని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. రాష్ట్రం ముక్కలైనా పరిశ్రమల సమాఖ్యకు సంబంధించిన సీఐఐ మాత్రం ఒక్కటిగానే ఉండాలని ఆకాంక్షించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగకపోవడంతో ఒక్క హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తం పరిమితమైందని చెప్పారు. దీనికి నిదర్శనం రాజధానిలో 435 వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు ఏర్పడట మేనన్నారు. హైదరాబాద్‌ను అన్నీ దొరికే ఒక ఐలాండ్‌గా మార్చేశారన్నారు. రెండేళ్లలో హెదరాబాద్ కన్నా వేగంగా అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.