సాక్షి ప్రతినిధి, కాకినాడ : ముందస్తు రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు చూస్తున్న జనానికి కొత్తగా అజ్ఞాత రాజకీయం తెరపైకి వచ్చింది. గత పదిరోజులుగా సమైక్యాంధ్ర పేరుతో వెలసిన హోర్డింగ్‌లు జిల్లాలో చర్చనీయాంశం కాగా ఇపుడు మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ విస్మయానికి గురి చేస్తోంది.
క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగిన ఎన్నో ఏళ్లకు ఇపుడు కొత్తగా పార్టీ స్థాపించడం, సందర్భంగా వచ్చినపుడు అందరూ బయటకు వస్తారని వ్యాఖ్యానించడం చూస్తుంటే శ్రీహరి ఈ అజ్ఞాత రాజకీయం నడుపుతున్నదెవరి కోసం అన్న సందేహం కలుగుతోంది. జిల్లా నుంచి ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటయింది. దాదాపు 23 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరమైన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి అకస్మాత్తుగా తెరపైకి వచ్చి ఆ పార్టీని రిజిస్టర్ చేయించడం.. ఆ పార్టీ తరఫున సమైక్యాంధ్రలో ఉన్న అన్ని స్థానాలకూ పోటీ చేస్తామని చెబుతుండడం చూస్తుంటే పార్టీ ఏర్పాటు వెనుక ఎవరి హస్తం ఉందనే అంశం జిల్లాలో చర్చనీయాం శంగా మారింది.
నిన్న మొన్నటివరకూ ప్రతి ఒక్కరి నోటా వినిపించిన ‘జై సమైక్యాంద్ర’ నినాదమే పేరుగా పెట్టుకొని పార్టీ పురుడు పోసుకోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర పేరుతో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఇటీవల కాలంలో ఏర్పాటయ్యాయి. వీటిని ఏర్పాటు చేసినవారు ఎవరై ఉంటారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్న పార్టీకి సమైక్యాంధ్ర హోర్డింగ్‌లను తొలివిడతగా తెరపైకి తీసుకువచ్చారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.
ఈ తరుణంలో జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో రాజకీయ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారు. మూడు నెలల క్రితమే ‘జై సమైక్యాంధ్ర’ రిజిస్టర్ అయింది. పార్టీని రిజిష్టర్ చేసిన శ్రీహరి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలో జిల్లా నుంచి కింగ్‌మేకర్‌గా చలామణీ అయిన ఎస్‌ఆర్‌ఎంటీ అధినేత కేవీఆర్ చౌదరికి ఈయన స్వయానా అల్లుడు.
ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీటీడీ బోర్డు డెరైక్టర్‌గా ఉన్న చిట్టూరి రవీంద్ర, శ్రీహరి స్వయానా తోడళ్లులు. శ్రీహరి 1984-89 మధ్య టీడీపీ హయాంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. 1989 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో మరోసారి రాజమండ్రి ఎంపీగా బరిలోకి దిగిన శ్రీహరి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టీడీపీకి 1990లో రాజీనామా చేశారు.
సుమారు 23 ఏళ్లు రాజకీయాలకు దూరమై తెరమరుగైన శ్రీహరి హఠాత్తుగా ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో రాజకీయపార్టీని రిజిష్టర్ చేసి రాజకీయాల్లో తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. 60 ఏళ్లు పైబడ్డ శ్రీహరి రాజకీయాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ కోసమే పార్టీని స్థాపించారా లేక మరో కారణమేమైనా ఉంటుందా అనే అంశం రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
రాజకీయాలంటే వెగటుపుట్టి ఇంతకాలం దూరంగా ఉంటున్నానని చెబుతోన్న శ్రీహరి హఠాత్తుగా పార్టీని రిజిష్టర్ చేయడమే కాకుండా సమైక్యాంధ్ర ముక్కలవుతుండడంతో మనసు కలతచెంది పార్టీ ఒకటి ఉండాలనే ఉద్ధేశంతో మూడు నెలల క్రితమే రిజిష్టర్ చేయించానని చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారని నర్మగర్భంగా చెప్పిన శ్రీహరి అంతరంగం ఏమిటో అంతుబట్టడం లేదు. అందరూ బయటకు వస్తారంటున్న శ్రీహరి మాటలు, పార్టీ ఏర్పాటు వెనుక ఎవరైనా పెద్దలున్నారా అనే దానికి బలం చేకూరుస్తున్నాయి.
సందర్భం వచ్చినప్పుడు పార్టీ విధి, విధానాలు ఇతర విషయాలు తెలియచేస్తానని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆయన చెప్పుకొచ్చారు. 23 ఏళ్లుగా రాజకీయాలకు దాదాపు దూరమైన శ్రీహరికి జిల్లాలో ప్రస్తుత రాజకీయ నాయకులు, ఏ పార్టీ కేడర్‌తోను పెద్దగా సంబంధాలు లేవు. అటువంటప్పుడు ఏ ఉద్దేశంతో పార్టీని రిజిష్టర్ చేశారనే విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
శ్రీహరీ.. ఇదేమి కిరికిరి!
Published Wed, Jan 22 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement