పెళ్లింట చావు డప్పు!
ఓ సినిమాలో పెళ్లి మండపానికి వస్తున్న హీరో బంధువులను హీరోయిన్ సోదరులు బాంబులతో హతమారుస్తారు. ఆ కోపంతో హీరోయిన్ సోదరులను కత్తితో అడ్డంగా నరికి పెళ్లి మండపాన్ని హీరో శ్మశానంగా మారుస్తాడు. ఆ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా శుక్రవారం దాచేపల్లి మండలం తక్కెళ్లపాడులో పెళ్లింట చావుడప్పు మోగింది. ఆ సినిమాలో హీరోయిన్ సోదరులు చెలరేగిపోగా, ఇక్కడ మొదటి భార్య కుటుంబీకులు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. వరుడు, అతని మేనత్తను అక్కడికక్కడే హతమార్చారు. అడ్డొచ్చిన వరుడు తల్లిదండ్రులు, సోదరుడు, మరో మేనత్తపై కత్తులు దూయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వరుడి తల్లిదండ్రులు, సోదరుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామం మరోసారి ఉలిక్కిపడింది. ఇదే తరహాలో గతంలో జరిగిన ఘటనను మరో సారి గుర్తుకు తెచ్చుకుంది.
సాక్షి, గుంటూరు / దాచేపల్లి : దాచేపల్లి మండలంలో మారణాయుధాలతో దాడులు జరగడం కొత్తేమీ కాదు. మూడేళ్ల కిందట కేసానుపల్లి గ్రామంలో ఆస్తి విషయమై సవతి తల్లి, ఆమె కుమార్తెను కొడుకే కత్తితో నరికి చంపిన సంఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన కోటా సీతారావమ్మ అనే మహిళకు రెండో వివాహం జరిగింది. భర్తకు మొదటి భార్యకు కొడుకు ఉన్నాడు. సవతి తల్లి కుమార్తెకు పెళ్లి జరిగితే ఆస్తిలో సగభాగం పోతుందని భావించిన మొదటి భార్య కుమారుడు చెల్లెలు పెళ్లి వారంలో ఉందనగా, తల్లీకూతుళ్లను హతమార్చాడు.
ఇప్పుడేం జరిగింది...
తక్కెళ్లపాడు గ్రామంలో శుక్రవారం ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడికి తెగబడడంతో రావుల కోటేశ్వరరావు(30) అనే యువకుడు, అతని మేనత్త గుండబోయిన మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోబోయిన కోటేశ్వరరావు తల్లిదండ్రులు చంద్రయ్య, వీరనాగమ్మ, సోదరుడు లింగరాజు, మరో మేనత్త తెంపల్లి వెంకట కోటమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన మృతుడు కోటేశ్వరరావు తల్లిదండ్రులు, సోదరుడు మృత్యువుతో పోరాడుతున్నారు.
ఇదీ నేపథ్యం...
సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రావుల కోటేశ్వరరావు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన తేలుకుట్ల పద్మావతితో వివాహం జరిగింది. ఏడాది అనంతరం విడిపోయారు. కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కోటేశ్వరరావుకు పెదనందిపాడు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. శనివారంగుంటూరు నగరంలో పెళ్లి జరగనుంది.
ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్న సమయంలో మొదటి భార్య అన్నదమ్ములు, బంధువులు ఒక్కసారిగా మారణాయుధాలతో కోటేశ్వరరావు ఇంటిపై దాడిచేశారు. ముందు కోటేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని దూసుకురాగా, అతడి తల్లిదండ్రులు, సోదరుడు, మేనత్తలు అడ్డుకోబోయారు. ఈ దాడిలో కోటేశ్వరరావుతోపాటు మేనత్త మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి తల్లిదండ్రులు, సోదరుడు మృత్యువుతో పోరాడుతున్నారు. మరో మేనత్తకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో గురజాలకు తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపారు.
గురజాల మండలం దైద గ్రామంలో నివాసముంటున్న చంద్రయ్య కుమార్తె గుండెబోయిన మల్లమ్మ మేనల్లుడి పెళ్లి చూసేందుకు శుక్రవారం ఉదయమే తక్కెళ్లపాడు వచ్చింది. పెళ్లికి ముందు ఇంట్లో జరిగే పూజ కార్యక్రమంలో అందరితో కలిసి పాల్గొంది.
కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి పెళ్లికి వెళ్లే విషయమై మాట్లాడుతుండగా జరిగిన దాడిలో మల్లమ్మ మృతి చెందింది.
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో నివాసముంటున్న కోటేశ్వరరావు మరో మేనత్త తెంపల్లి వెంకట కోటమ్మ గురువారం రాత్రి తక్కెళ్లపాడు వచ్చింది. మేనల్లుడిపై జరుగుతున్న దాడిని ఆపే క్రమంలో తీవ్రంగా గాయపడింది.
కళ్లముందే కుమారుడు కోటేశ్వరరావును హత్య చేస్తుండటంతో వృద్ధులైన తల్లిదండ్రులు చంద్రయ్య, వీరనాగమ్మ, తమ్ముడు లింగరాజులు అడ్డుకున్నారు. ప్రత్యర్థులు తమ చేతిలో ఉన్న మారణాయుధాలతో చంద్రమ్మ, వీరనాగమ్మ తలపై బలంగా బాదడంతో తీవ్రంగా గాయపడ్డారు. లింగరాజు చేతి, కాలును గొడ్డలితో నరికారు.
కోటేశ్వరరావును హత్య చేస్తున్న క్రమంలో అడ్డువచ్చిన అతని అన్న కుమారులు మల్లికార్జునరాజు, అశోక్‌రాజులను ప్రత్యర్థులు ఇంటి నుంచి బయటకు నెట్టేశారు.
డీఎస్పీ పూజ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు హత్యకు గురికావటం, మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోటేశ్వరరావు, మల్లమ్మ మృత దేహాలపై పడి బంధువులు విలపిస్తున్న తీరు చూపరుల కంట తడిపెట్టించింది. ఈ ఘటన గురించి తెలుసుకుని దాచేపల్లి, కేసానుపల్లి, అలుగుమల్లెపాడు గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి తరలివచ్చారు.
మాజీ ఎమ్మెల్యే జంగా పరామర్శ...
తక్కెళ్లపాడులో జంట హత్యల గురించి తెలుసుక్ను వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాలను పరిశీలించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.