
భలే భలే...బుల్లి బైక్
యువతలో పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడో మెకానిక్.
కృష్ణాజిల్లా (కలిదిండి): యువతలో పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడో మెకానిక్. మండల కేంద్రమైన కలిదిండికి చెందిన దార్లలంక కాశీవిశ్వనాథ్ (నాని) బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పట్టుదలతో ఒక కొత్త బైక్‌ను రూపొందించాలని ఆలోచన తనకు తట్టింది. దీనిలో భాగంగానే సుమారు 45 రోజులు శ్రమించి 19 వేల వ్యయంతో ఒక బుల్లి బైక్‌ను రూపొందించి అందరినీ ఆకట్టుకున్నాడు. సింగిల్ సీటుతో ఉన్న ఈ బైక్ సుమారు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నట్లు నాని చెప్పాడు. నాలుగు గేర్లు కలిగి ఉండి క్లచ్‌లేకుండా దీనిని నడపడం చాలా సులువుగా ఉంటుందని వివరించాడు. వివిధ మోటారు సైకిళ్ల విడిభాగాలతో ఈ బైక్ ను తయారుచేసినట్లు తెలిపారు. ఒక లీటరు పెట్రోలు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు మైలేజీ రావడం ఈ బైక్ ప్రత్యేకత అన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు అందుబాటులోకి ఒక బైక్ తేవాలనే ఆకాంక్షతోనే ఈ బైక్‌ను రూపొందించినట్లు వివరించాడు. నా కల నెరవేరింది..
నా కల నెరవేరింది..
సొంత ఆలోచనతో ఏదో ఒకటి తయారు చేయాలని నాలో కాంక్ష కలిగింది. దీంతో చిన్నపిల్లలకు సైతం ఉపయోగపడే బైక్‌ను కనుగొనాలని ఆలోచన తట్టింది. ఎంత కష్టమైనా ఇతర మోటారుసైకిళ్ల విడిభాగాలు సేకరించి ఈ బల్లిబైక్‌ను తయారు చేశాను. త్వరలో చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగునేందుకు ప్రయత్నిస్తున్నాను.