ఎగతాళి | A young boy theft the gold chain | Sakshi
Sakshi News home page

ఎగతాళి

Published Tue, Jul 7 2015 11:47 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

ఎగతాళి - Sakshi

ఎగతాళి

- బాలిక మెడలో తాళి కట్టిన యువకుడు
- చదివిస్తానంటూ మాయమాటలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
- నిందితుడ్ని విచారిస్తున్న పోలీసులు
యలమంచిలి :
మాయమాటలు చెప్పి బాలిక మెడలో పసుపుతాడు వేశాడో ప్రబుద్ధుడు. రెండు రోజులు తర్వాత విజయవాడ తీసుకు వెళ్తానని ..తాళిని భద్రంగా చూసుకోమని చెప్పాడు. ఈలోగా వ్యవహారం వెలుగుచూడటంతో తాళి కట్టిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా..యలమంచిలి పట్టణం సీపీపేట రెల్లివీధికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం స్నేహితురాళ్లతో శివాలయం వద్దకు వెళ్లింది. అక్కడ బొమ్మలపెళ్లి ఆట ఆడుకుంటోంది.

ఇదేసమయంలో బంగారి అప్పన్న(22) అక్కడకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న పసుపు తాడును బాలిక మెడలో కట్టాడు. ఒకటిరెండు రోజుల్లో  విజయవాడ తీసుకెళ్లి కాపురంపెట్టి చదివిస్తానని చెప్పాడు. తల్లిదండ్రులు చూస్తారన్న భయంతో బాలిక మెడలోని పసుపు తాడును స్కూల్ బ్యాగులో పెట్టింది. సోమవారం స్కూల్‌కు వెళ్లినప్పుడు తాళిబొట్టు మెడలో వేసుకుంది.

తోటి విద్యార్ధినులు వెంటనే క్లాస్‌టీచర్ దృష్టికి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులకు కబురుపెట్టారు. తల్లిదండ్రులు వచ్చి తాము కులపెద్దలతో మాట్లాడి పరిష్కరించుకుంటామని, విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పారు. ఒక టీచర్ ద్వారా  విషయం బయటకు వ్యాపించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
 
విద్యాశాఖాధికారులు విచారణ..
జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి సంఘటనపై విచారణ జరపాలని ఉప విద్యాశాఖాధికారి రేణుకను ఆదేశించారు. ఆమె మంగళవారం పాఠశాల సందర్శించారు. బాధిత బాలిక, ఆమె స్నేహితురాళ్లను విచారించారు. జరిగిన ఉదంతాన్ని మర్చిపోయి జాగ్రత్తగా చదువుకోవాలని బాలికకు చెప్పారు.
 
బుద్దిగా చదువుకుంటానని, తల్లిదండ్రులను విడిచి  వెళ్లనని బాలిక తనను కలిసిన విలేకరులకు చెప్పింది. నిందితుడు అప్పన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో సంయమనం.. గోప్యత పాటించలేదంటూ టీచరుపై దళితహక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంపాని చంద్రరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement