
బడి చదువుకూ ‘ఆధార్’ ని‘బంధనం’
సాక్షి, రాజమండ్రి :యూపీఏ-2 సర్కారు ఏ లక్ష్యంతో దేశప్రజలకు ఆధార్ కార్డులను తప్పనిసరి చేసినా.. దాని పర్యవసానంగా జనం- ముఖ్యంగా బడుగు జనం ముప్పుతిప్పలు పడుతున్నారు. వంటగ్యాస్‌కు ఆధార్‌ను లంకె పెట్టి, సబ్సిడీ ఎక్కడ గల్లంతవుతుందోనని కోట్లమంది కంటికి కునుకు కరువు చేసింది కేంద్రంలోని గత ప్రభుత్వం. అనంతరం ఆ లంకెను తెంచినా.. ఇప్పుడు మళ్లీ ముడిపెట్టనున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా..ఒక ప్పుడు ఆధార్ ప్రక్రియను విమర్శించిన టీడీపీ అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా అన్నింటికీ ఆధార్‌ను జోడిస్తూ పోతోంది. రేషన్‌కు, పింఛన్‌కు ఆధార్‌ను జోడించడంతో అవి లేని వారు, వాటిలోని వివరాలు సరిపోలని వారు సర్కారుపరంగా పొందే లబ్ధికి నీళ్లు వదులుకునే బెడదను ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు చదువులకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసింది. దీంతో కొత్తగా చేరే వారే కాదు బడిలో చదువుతున్న పిల్లలు సైతం ఆధార్ సంఖ్యతో తమ ప్రవేశ సంఖ్యను అనుసంధానం చేసుకోవాలని ఉపాధ్యాయులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 20 శాతం విద్యార్థుల ఆధార్ కోసం పేరు నమోదు చేసుకోలేదు. వీరిలో సగం మంది తల్లిదండ్రులకు ఆధార్ కార్డున్నా వారి పిల్లలకు లేదు. రానున్న రోజుల్లో ఆధార్ కార్డు ఉంటేనే స్కూళ్లలో ప్రవేశం అన్నది ఒక నిబంధన కానుందని, అది లేనిదే సర్కారుపరంగా అందే రాయితీలు అందవని విద్యాశాఖ అధికారులు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నారు. అయితే దీన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల వారు వ్యతిరేకిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో అనుసంధానం కోసమట..
విద్యార్థి వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచేందుకు ఆధార్ సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి తన ఆధార్ కార్డు జిరాక్సు కాపీని పాఠశాలలో అందించాలని నెల్లాళ్లుగా ఉపాధ్యాయులు ఆదేశించారు. ఇంకా ఇవ్వని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు లేని విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తటపటాయిస్తున్నారు. కొత్తగా ఏ ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నా ఆధార్ ఉండాల్సిందేనని అధికారులు ఇప్పటికే కచ్చితంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు లేని విద్యార్థులు బడి మానేసే దుస్థితి ఎదురవుతుందని ఉపాధ్యాయ సంఘాలు నిరసిస్తున్నాయి.
కార్డు లేకుంటే వివరాలు దూరం..
జిల్లాలో 90 శాతానికి పైగా ఆధార్ కార్డుల జారీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ విద్యార్థుల విషయంలో వాస్తవ పరిస్థితి అలా లేదు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేసే పాఠశాలలు 5,995 ఉన్నాయి. వీటిలో ప్రాధమిక పాఠశాలలు 3967, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 977, హైస్కూళ్లు 984, హయ్యర్ సెకండరీ స్కూళ్లు 67 ఉన్నాయి. వీటిలో 7.72 లక్షల మంది ఒకటి నుంచి పదవ తరగతి వరకూ చదువుతున్నారు. వారిలో అనేకులకు ఆధార్ కార్డులు లేవు. ఉన్నా పేర్లు తప్పుగా ఉన్నాయి. తల్లిదండ్రులకు కార్డున్నా పిల్లలకు లేవు. జిల్లాలో ఇలాంటి కారణాలతో 20 శాతం విద్యార్థులు ఆధార్ సమర్పించలేని స్థితిలో ఉన్నారు.
ఇలాంటి వారిలో ఎక్కువ మంది రెక్కల కష్టంపై ఆధారపడ్డ కుటుంబాల వారే. తల్లిదండ్రులు ఉదయం కూలి పనులకు వెళ్లి సాయంత్రం రావడం, పగలు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం.. ఈ క్రమంలో పలువురు పిల్లలకు ఆధార్ నమోదు చేయించలేదు. పిల్లలకు ఆధార్ అవసరం కాదన్న కొందరు నమోదు చేయించలేదు. మరి కొందరు పిల్లల అసలు పేర్లు కాక వాడుక పేర్లు ఆధార్‌లో నమోదు చేయించడంతో అవి చెల్లుబాటు కావడం లేదు. ఆధార్ కార్డు లేక పోతే విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్ డేటా బేస్‌లో కనిపించవు. ప్రభుత్వపరంగా స్కాలర్ షిపు్పులు తదితర రాయితీలు ఆధార్ కార్డు లేనిదే వర్తించవు. ఏ కార్యక్రమానికైనా విద్యార్థుల వివరాలు కావాలనుకున్నప్పుడు ఆధార్ కార్డులు సమర్పించని వారి పేర్లు కనిపించవు. ఇందువల్లే ఆధార్ కార్డులు తప్పనిసరి అని విద్యాశాఖ హుకుం జారీ చేస్తోంది.
నమోదు బాధ్యతను సర్కారే తీసుకోవాలి..
ప్రస్తుతం రెండు మూడు రోజులు ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు పడి ఉంటే తప్ప నమోదు చేసుకోవడం వీలు కావడం లేదు. ఆధార్ లేని వారు పాఠశాల వదిలి తల్లిదండ్రులతో ఆధార్ సెంటర్‌లకు వెళ్లడం అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. విద్యార్థులకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం వాటి నమోదు బాధ్యతను కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాలలకు వచ్చి లేదా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి విద్యార్థులందరికీ కార్డులు అందించాలంటున్నాయి.