మంత్రికి ఝలక్ | aadhar link to debt waiver | Sakshi
Sakshi News home page

మంత్రికి ఝలక్

Published Sat, Jun 28 2014 3:03 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

మంత్రికి ఝలక్ - Sakshi

మంత్రికి ఝలక్

 సాక్షి, ఒంగోలు : ‘డామిట్..కథ అడ్డం తిరిగింది..’ అన్న చందంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలుగు తమ్ముళ్ల ప్రయత్నం అభాసుపాలైంది. తొలిసంతకంతో రైతు రుణమాఫీ అమలు చేయలేకపోయిన ప్రభుత్వం.. అధికార పార్టీ నేతలతో ప్రస్తుతం పూటకోమాట చెప్పిస్తోంది. ఆధార్‌కార్డు లింకు, చిన్నసన్నకారు రైతులకే లబ్ధి, రూ.1 లక్షలోపు రుణాల్నే మాఫీ చేస్తారంటూ.. తదితర ప్రకటనలతో నేతలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చినకాడికి వచ్చిందే దక్కుదలగా రైతులను మానసికంగా సిద్ధం చేయాలనే ప్రణాళికా రచన కొనసాగుతోంది.
 
 = ఇదే విషయాన్ని ఇప్పటికే రైతుసంఘాల నేతలు గుర్తించినప్పటికీ, ప్రభుత్వం నుంచి పంటరుణ మాఫీపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
 = ఈక్రమంలో ప్రకాశం జిల్లా వేదికగా చేసుకుని తాము చెప్పినట్టు రైతులతో తలాడించవచ్చనే ఎత్తుగడకు టీడీపీ నేతలు తెరతీశారు. శాస్త్రవేత్తలు, రైతులతో ముఖాముఖి అంటూ ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆహ్వానించారు.
 = ఈసందర్భంగా ఆయన ప్రసంగం ఆద్యంతం రాష్ట్రంలోని 13 జిల్లాల సమస్యలు, ప్రభుత్వ ఖజానా ఆదాయం తదితర వివరాలను ప్రస్తావిస్తూ.. రైతుల పంటరుణాలు మాఫీ కావాలంటే కేంద్ర సహకారం తప్పనిసరని, కేంద్రం మొండిచేయి చూపితే రాష్ట్ర ప్రభుత్వమేమీ చేయలేద న్నారు.
 = ఈ ప్రస్తావనపై అక్కడున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అజెండా హామీని తొలి సంతకంతోనే నెరవేర్చుకుంటామన్న పెద్దలు.. నేడు అధికారంలోకి రాగానే కేంద్రం పేరుతో కుంటిసాకులు చెప్పొద్దంటూ బహిరంగంగానే కేకలేస్తూ అసంతృప్తిని వెళ్లగక్కారు.
 = అధికార పార్టీ నేతల ప్రకటనల మేరకు ఆధార్‌కార్డు లింకు, రూ.లక్షలోపు మాఫీ, చిన్నసన్నకారు రైతులనే నిబంధనలు పెట్టరాదన్నారు. రుణమాఫీతో పాటు గతంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి పరిహారం పంపిణీపై స్పష్టతనివ్వాలని మంత్రిని డిమాండ్ చేశారు.
 = ఊహించని పరిణామానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు అక్కడున్న అధికారపార్టీ నేతలు బిత్తరపోయారు. షాక్‌లోనుంచి తేరుకున్న అధికారపార్టీ నేతలు కొందరు రంగంలోకి దిగి ఆందోళన చేస్తోన్న రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో స్వపక్షంలోనే ఇరువర్గాలు మంత్రి సమక్షంలో వాదులాడుకున్నారు.
 = అదేవిధంగా జిల్లా అభివృద్ధిని టీడీపీ నేతలు పట్టించుకోవడంలేదని, కేంద్ర విద్యాసంస్థలతో పాటు ఇతర అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాకు, గుంటూరు, విజయవాడ, విశాఖ జిల్లాలకే పరిమితం చేస్తున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర జిల్లాలకు మధ్యలోనే ఒంగోలును రాష్ట్ర రాజధానిగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
 రైతు సంక్షేమానికి కృషి..
శనగల కొనుగోలుపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక వ్యవసాయ ుమార్కెట్ యార్డులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో శనగలు టన్నుల కొద్దీ నిల్వలు ఉన్నాయని.. ప్రస్తుత ధర రూ.3,100 కొంటే రైతులకు నష్టం వస్తుందని తెలిసే వెనకడుగు వేశామన్నారు. రైతుకు గిట్టుబాటు ధర కనీసం రూ.3,500 కొనాల్సి ఉందన్నారు.

ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఉన్నాయా? లేదా..? అనే విషయాన్ని కూడా తెలుసుకుంటామని చెప్పారు. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.  సుబాబుల్, జామాయిల్‌కు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాసరావుని మంత్రి ఆదేశించారు. వ్యాపారులు, రైతులతో కలిసి కలెక్టర్‌తో మీటింగ్ ఏర్పాటు చేయించి గిట్టుబాటు ధర కల్పించేలా వ్యాపారులపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. కనీసం రూ.4,400 కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement