అనారోగ్య శ్రీ
అనంతపురం అర్బన్ : అనంతపురం సర్వజనాస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇంటర్‌నెట్ సౌకర్యం తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అనుమతి తీసుకునేందుకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో డయాలసిస్ మినహా మిగతా వైద్య సేవలు ఆగిపోయాయి. గడిచిన మూడు రోజులుగా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి.
ఆస్పత్రిలో ప్రతి రోజూ ఏదో ఒక విభాగం తరఫున ఆపరేషన్లు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవడం సాధ్యం కాకపోవడంతో ఆపరేషన్లకు బ్రేక్ పడింది. కిరణ్ సర్కార్ 2012, ఏప్రిల్‌లో పలు ఆపరేషన్లు ప్రభుత్వ ఆస్పత్రులలోనే చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి 133 సమస్యలకు సంబంధించి సర్వజనాస్పత్రిలోనే ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ సమస్య తలెత్తడంతో వైద్యులు సైతం మిన్నకుండిపోతున్నారు.
మూడు రోజులుగా సమస్య కొనసాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వస్తున్న ఎంతో మంది రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో పాటు ఆస్పత్రిలో చేరి అనుమతి కోసం ఎదురు చూస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్ చేసే ముందు ఆన్‌లైన్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు (హైదరాబాద్)కుసమాచారం అందించాలి. అక్కడి నుంచి అనుమతి వస్తేనే ఆపరేషన్ చేయాలి. అలా కాకుండా ఆపరేషన్ చేస్తే సంబంధిత వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది ఖాతాలో డబ్బులు జమ కావు.
ఇంటర్‌నెట్ బిల్లు కట్టకపోవడమే కారణమా?
బిల్లు కట్టకపోవడంతోనే సర్వజనాస్పత్రిలో ఇంటర్‌నెట్ సేవలు ఆపేసినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం, ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్లక్ష్యం వల్ల రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఏ ఆపరేషన్ చేయాలన్నా కాలయాపన చేస్తున్నారు.
పడకలు కూడా కరువే
ఆరోగ్యశ్రీ రోగులకు కనీసం మంచాలు కూడా ఏర్పాటు చేయలేని దయనీయ స్థితిలో ఆస్పత్రి యాజమాన్యం ఉంది. గతేడాది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆర్థో, ఎఫ్‌ఎస్-1, లేబర్ విభాగాల్లో ప్రత్యేక వార్డులను కేటాయించారు. 10 నుంచి 20 పడకలు సామర్థ్యం కల్గిన వార్డులున్నా అవి పూర్తి స్థాయిలో రోగులకు ఉపయోగపడటం లేదు. ఒక్కో మంచంలో ఏకంగా ఇద్దరు, ముగ్గురు పడుకోవాల్సి వస్తోంది. విధిలేక కొందరు నేలపైనే నిద్రిస్తున్నారు. లేబర్‌వార్డు పైభాగాన ఉన్న ఎఫ్‌ఎస్-1 పక్కన ఆరోగ్యశ్రీ ప్రత్యేక వార్డు ఉంది. ఈ వార్డులో కు.ని. ఆపరేషన్లు చేసిన ఒకరిద్దరిని ఉంచుతున్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన రోగులను ఉంచకుండా వార్డును వృథాగా ఉంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా ప్రశ్నించే నాథులే కరువయ్యారు.
ఎటువంటి సమస్యా లేదు
ఆరోగ్యశ్రీ కౌంటర్‌లో ఇంటర్‌నెట్ సమస్య ఉన్నది వాస్తవమే. అయితే.. డయాలసిస్ యూనిట్‌లో నెట్ పనిచేస్తోంది. మిగతా వాటికి ఫోన్ ద్వారా అనుమతి తీసుకుంటున్నాం.
- డాక్టర్ ప్రవీణ్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్