గందరగోళంలో ఆరోగ్యశ్రీ
- ట్రస్టు విభజనపై ఇరు రాష్ట్రాల్లో సందిగ్ధం
- విభజన చట్టంలో లేని మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ‘ఆరోగ్యశ్రీ’ మాత్రం ఉమ్మడిగానే ఉండిపోయింది. రెండు రాష్ట్రాల బాధ్యతలను ఒకే ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) నిర్వహిస్తుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విధానాలు, ప్రాధాన్యాలు మారిపోయాయి. ప్రభుత్వాల ఆలోచనలూ భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఆరోగ్యశ్రీ ట్రస్టు విభజన ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పుడు విభజిస్తారో అంతుబట్టడం లేదు.
లక్షలాది మంది పేదలకు, ఉద్యోగులకు సేవలందించే ఆరోగ్యశ్రీని గాలికి వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి వస్తే అందరికీ మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఆరోగ్యశ్రీ విభజనకు సంబంధించి స్పష్టత లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలంగాణ ఉన్నతాధికారులు అంటున్నారు.
చట్టంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటే నిబంధనల ప్రకారం విభజన జరిగేది. 9వ షెడ్యూల్‌లో ఉంటే ఆరోగ్యశ్రీని నిట్టనిలువునా విభజించే అవకాశం ఉండేది. ఆస్తులు, సేవలు, నిధులు, సిబ్బందిని జనాభా నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించేవారు. ఒకవేళ పదో షెడ్యూల్‌లో ఉంటే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్రానికే ట్రస్టును బదలాయించేవారు.
ఆ ప్రకారం అది హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణకే దక్కుతుంది. ఈ రెండు షెడ్యూళ్లలో ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఎలా విభజించాలన్న దానిపై ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలు, సిబ్బంది అంతర్గత పని విభజన జరిగినా సేవలు అందించడంలో సమస్యలు వస్తున్నాయి. తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ సలహాకు వెళ్లింది.
విభజన జరగక సమస్యలు..
పేదలకు, ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య సేవలు అందించే బాధ్యతను ఆరోగ్యశ్రీనే చూసుకుంటోంది. తెల్లకార్డున్న లక్షలాది మంది పేదలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. నగదు రహిత కార్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సేవలు పొందుతారు. మొత్తం 938 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో చికిత్స చేస్తారు. అయితే ఆరోగ్య సేవల విషయంలో రెండు రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలను ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఒక్కో పేద కుటుంబానికి రూ. 2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంది.
అదే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతో ఈ పరిమితిని రూ. 2.50 లక్షలకు పెంచారు. అంతేకాదు ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి సీఈవోగా ఉన్న ఐఏఎస్ అధికారిని ఏపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన సహజంగా ఏపీపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సీఈవోగా ఉన్నా అక్కడి అధికారి తెలంగాణలో పర్యవేక్షణ బాధ్యతలు చూడటం ఇబ్బందిగా ఉంటుందన్న వాదన కూడా ఉంది. దీంతో తెలంగాణలో పేదలు, ఉద్యోగులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.
మరోవైపు ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్యమిత్రలు జీతాలు పెంచాలని కోరుతున్నారు. వారి గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. వైద్య శిబిరాలు కూడా అనుకున్నంతస్థాయిలో జరగకపోవడంతో రోగులు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పర్యవేక్షణలోపం వల్ల ఆరోగ్యశ్రీ సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. విభజన చేపట్టాలని స్వయానా సీఈవోనే ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. కనీసం సీఈవో పర్యవేక్షణలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేకాధికారులనైనా నియమిస్తే బాగుంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
న్యాయ సలహాకు వెళ్లాం
రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో దేనిలోనూ ఆరోగ్యశ్రీ విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. అందువల్ల ఈ విషయంలో గందరగోళం నెలకొంది. అందుకే ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో న్యాయ సలహాకు వెళ్లాం. అక్కడి నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాక విభజనపై ముందుకు వెళ్తాం. ఇప్పటికే విభజనకు సంబంధించిన ఫైలును సిద్ధం చేశాం.
- సురేష్‌చందా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ
రాష్ర్ట విభజన (జూన్ 2, 2014) నాటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు
రోగుల రిజిస్ట్రేషన్- 4.56 లక్షలు
సేవలు పొందిన రోగులు- 2.92 లక్షలు
జరిగిన శస్త్రచికిత్సలు, థెరపీలు
ప్రభుత్వాసుపత్రులు-57 వేలు
ప్రైవేటు ఆసుపత్రులు-1.16 లక్షలు
విడుదలైన నిధులు
ప్రభుత్వాసుపత్రులు-రూ. 160 కోట్లు
ప్రైవేటు ఆసుపత్రులు - రూ. 323 కోట్లు