కనులు లేవని.. కలత పడలేదు
వీరవాసరం, న్యూస్‌లైన్ : కనులు లేవని కలత చెందలేదు.. క్రమశిక్షణ , పట్టుదల, శ్రమించే తత్వం ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించాడు ఈ విద్యార్థి. స్నేహితుల సహకారానికి తన మేథస్సును జోడించి డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచాడు బీఎస్ రంగా అభిజిత్. వీరవాసరం ఎస్‌ఎంబీటీ ఏవీఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనలియర్ పూర్తిచేసిన అభిజిత్‌ను బుధవారం ‘న్యూస్‌లైన్’ పలకరించింది. అభిజిత్ మాట్లాడుతూ ‘మాది పాలకొల్లు. నాన్న సత్యజిత్ కుమార్ ఐన్‌జీ వైశ్యా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ కృష్ణ సుజాత గృహిణి, అన్నయ్య నాగ సత్యమంజిత్ బెంగుళూరులో సీఎ చ దువుతున్నాడు. టెన్త్ వరకు పాలకొల్లు బీఆర్‌ఎం స్కూల్‌లో, ఇంటర్ పాలకొల్లు ఛాంబర్స్ కాలేజీలో పూర్తి చేశాను.
టెన్త్ చదువుతుండగా గ్లూకోమా వ్యాధి సోకడంతో కంటి చూపు కోల్పోయాను. కేరళలో రెండేళ్లు వైద్యం చేయించినా ఫలితం లేదు. చదువుపై ఉన్న ఆసక్తి, తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితుల సహకారంతో ఇక్కడిగా రాగలిగాను. అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ స్నేహితుల సహకారంతో బీఏ పరీక్షలు రాశాను. 1000 మార్కులకు 842 వచ్చాయి. కాలేజ్ టాపర్‌గా నిలిచారు. ఇందుకు స్నేహితులు, ఉపాధ్యాయలు సహకారం మరవలేనిది. సివిల్స్ విజేతగా నిలవాలన్నదే నా కోరిక’ అన్నారు. అభిజిత్‌ను కళాశాల సెక్రటరీ వర్థినీడి సత్యనారాయణ (బాబ్జీ), కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వీ రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.