కదిరి : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. కదిరి ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్ ఇంటిపై శనివారం దాడులు చేశారు. రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు. అందుకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వినాయక ప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆరు గంటలకే కదిరి పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి.
దీంతో డీఈని అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. ఇంకా కదిరి, పుట్టపర్తి బ్యాంకుల్లో డీఈకి సంబంధించిన లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపైకొంతకాలంగా రైతుల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ప్రత్యేక నిఘా పెట్టారు. అవి నిజమని ధ్రువీకరించుకొని కదిరిలోని ఆయన ఇంటి పైనే కాకుండా ధర్మవరం, అనంతపురంలోని బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేశారు. అయితే.. అక్కడ ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. సోదాల అనంతరం ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి కదిరిలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
వినాయక ప్రసాద్‌కు బెంగళూరు, అనంతపురంలో మూడంతస్తుల భవనాలు రెండు చొప్పున, హిందూపురంలో ఒకటి, పుట్టపర్తిలో మూడిళ్లు.. ఇలా మొత్తం ఆరు ఖరీదైన ఇళ్లు ఉన్నట్లు పత్రాల ద్వారా తెలుస్తోందన్నారు. సికింద్రాబాద్, హిందూపురం, కదిరి, పుట్టపర్తిలో ఐదు చోట్ల విలువైన ఇళ్ల స్థలాలు కూడా ఉన్నట్లు ధ్రువీకరించుకున్నామన్నారు. వీటి విలువ రూ.6-7 కోట్లు ఉంటుందన్నారు. (మార్కెట్ విలువ ప్రకారమైతే ఈ విలువ రూ.15 కోట్లు) గోరంట్లలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోందని, వాస్తవానికి ఏడెనిమిది ఎకరాలు ఉన్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.
కదిరిలోని ఎస్‌బీఐ, పుట్టపర్తిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో డీఈకి సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరిస్తే బంగారం, మరిన్ని పత్రాలు, నగదు లభిస్తుందని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటి నుంచి రూ.71 వేల నగదు, 31 తులాల బంగారం, ఒకటిన్నర కిలో వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు ఏసీబీ సీఐలు గిరిధర్, ప్రభాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన మైన్స్ అండ్ జియాలజీ శాఖ గెజిటెడ్ అధికారులు ధనుంజయ్, బాలసుబ్రమణ్యం సహకారం కూడా తీసుకున్నారు.
మున్సిపల్ ఈఈ ఇంట్లో సోదాలు
ధర్మవరం : కదిరి ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్‌కు బావ వరుస అయిన ధర్మవరం మునిసిపల్ ఈఈ నాగమోహన్ ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ కర్నూలు డీఎస్పీ మహబూబ్ బాషా నేతృత్వంలో సీతారామారావు, రమేష్, వెంకటశివారెడ్డిల బృందం ఉదయం నుంచి ముమ్మరంగా సోదాలు చేసింది. పలు రికార్డులను, కంప్యూటర్‌లో నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలించారు. కదిరి ట్రాన్స్‌కో డీఈ ఆదాయానికి మించి ఆస్తులు కల్గివున్నారన్న సమాచారంతో ఏకకాలంలో ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశామని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.