
సాక్షి, విశాఖపట్నం, విజయవాడ: టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకటరఘు, ఆయన బీనామీగా భావిస్తున్న విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపై సోమవారం ఏసీబీ అధికారులు జరిపిన వేర్వేరు దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారి రఘు ఆదాయానికి మించి ఆస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు ఆయన, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. చిత్తూరులోని రఘు అత్తం ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, మంగళగిరి, నెల్లూరు, తిరుపతి, షిర్డీలోనూ రఘు బంధువులు ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. 500 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది.
ఇక, విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపైనా ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. గన్నవరం, విజయవాడలోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. వందలకోట్ల ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘుకు సమీప బంధువులైన ఏవో వెంకట శివప్రసాద్, ఆయన భార్య గాయత్రి.. ఆయనకు బినామీలుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
గతంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో టెక్నికల్ ఇంజినీర్‌గా గాయత్రి పనిచేశారు. ఆమె ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాయత్రి పేరు మీదనే మొత్తం డాంక్యుమెంట్లు లభించినట్టు సమాచారం.
సోదాల్లో ప్రామిసరీ నోట్లు, బంగార అభరణాలు లభించాయి. బంగారు అభరణాల్లో దేవతా విగ్రహాలు, ఊయలలు, జడలు దొరకడం గమనార్హం. గన్నవరంలో 1.40 ఎకరాల్లో కల్యాణ మండపం నిర్మాణం, ఇక్కడే నిర్మాణంలో ఉన్న పలు అపార్ట్‌మెంట్లలో 16 ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వేల్పూరులో వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు వీరికి ఉన్నట్టు గుర్తించారు.
ఏవో వెంకటశివప్రసాద్‌కు చెందిన గన్నవరంలోని ఇంట్లో రూ.10కోట్ల విలువైన బంగారం, రూ.50లక్షల నగదు, పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసరీ నోట్లు, పేరు లేని ఎంవీఆర్ జ్యుయలరీ బిల్లులు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. కృష్ణాజిల్లా వేల్పూరులో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్ టీమ్ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. రఘుకు షిర్డీలో కూడా ఓ లాడ్జ్ ఉందని, గన్నవరంలోని ఓ రియల్ ఎస్టేట్‌లో శివప్రసాద్ పేరు మీద 300 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది.