ఏసీబీ వలలో హౌసింగ్ ఏఈ
భీమునిపట్నం: ఇంటి నిర్మాణ బిల్లుల మంజూరుకు లంచం తీసుకుంటూ ఏసీబీకిగృహనిర్మాణశాఖ ఏఈ పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్సీ నర్సింహరావు విలేకరులకు తెలిపారు. భీమిలి మండలం తాటితూరుకు చెందిన ఉంటబట్ల చిన్నారావు, పల్లంటి పద్మలకు రెండేళ్ల క్రితం హౌసింగ్ స్కీంలో ఇళ్లు మంజూరయ్యాయి. వీరిద్దరూ పక్కపక్కనే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీరి ఒకొక్క ఇంటికి రూ.80 వేల బిల్లు ప్రభుత్వం నుంచి ఐదు విడతల్లో చెల్లింపు జరగాలి. ఈ మొత్తంలో కొంతమొత్తం మాత్రమే విడుదలైంది. మిగతా మొత్తంకోసం ఏడాదినుంచి వారు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
ఈ బిల్లులు చెల్లించేందుకు హౌసింగ్ ఏఈ వైవీ వెంకటరావు రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇస్తేనేగాని బిల్లు విడుదల చేసేది లేదని చెప్పడంతో రూ.10 వేలు ఇచ్చేందుకు లబ్ధిదారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత వారిద్దరు ఏసీబీ డీఎస్పీ నర్సింహరావును ఆశ్రయించారు. ఏఈ వెంకటరావు చెప్పినమేరకు బాధితులిద్దరు విశాఖ మద్దిలపాలెం వద్ద ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గేటు వద్దకు వెళ్లారు.
అక్కడికి వచ్చిన ఏఈకి రూ.10 వేలు లంచం ఇచ్చారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ డీఎస్పీ నర్సింహరావు, సిబ్బంది లంచం తీసుకున్న ఏఈని అరెస్టు చేశారు. అక్కడినుంచి భీమిలి హౌసింగ్ కార్యాలయానికి ఏఈని తరలించారు. రికార్డులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో మరో డీఎస్పీ రమేష్, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, గణేష్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.