గజ్వేల్/ జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్: ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను పట్టేశారు. పట్టామార్పిడి కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు డిమాండ్ చేసిన ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్)ని అతని కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పారిపోయే ప్రయత్నం చేసినా నిలువరించి అదుపులోనికి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం జగదేవ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఉద్యోగవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బాధిత రైతు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... జగదేవ్‌పూర్ మండలం బీజీ వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని మాందాపూర్ గ్రామానికి చెందిన లింగాల నర్సయ్యకు ఇద్దరు కుమారులు సంతానం.
నర్సయ్య, అతని పెద్దకుమారుడు కనకయ్య కొంతకాలం క్రితం చనిపోయారు. దీంతో నర్సయ్య పేరిట గ్రామంలోని 516, 517 సర్వే నంబర్‌లో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని తన పేరు మీద, తన వదిన పేరుమీద పట్టా చేసి ఇవ్వాలని(మ్యుటేషన్) నర్సయ్య చిన్నకుమారుడు రాంచంద్ర 15 రోజుల క్రితం స్థానిక తహశీల్దార్‌ను సంప్రదించాడు. ఆర్‌ఐతో పంచనామా చేయించుకు రావాలని తహశీల్దార్ సూచించడంతో రాంచంద్రం ఆర్‌ఐ సతీష్‌ను కలిశాడు. మ్యుటేషన్ చేయాలంటే రూ.30 వేలు ఖర్చవుతుందని ఆర్‌ఐ చెప్పడంతో తాను పేద రైతుననీ, అంత ఇచ్చుకోలేనని రాంచంద్ర బతిమాలుకున్నాడు. అయితే పైసల్ తెస్తేనే పని చేసిపెడతానంటూ ఆర్‌ఐ సతీష్ తేల్చిచెప్పడంతో చివరకు రూ.20 వేలు ఇచ్చేందుకు రాంచంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అడ్వాన్స్‌గా రూ.5 వేలు అప్పుడే చెల్లించాడు. మరోవారం రోజుల్లో మిగతా రూ.15 వేలు ఇచ్చి మ్యుటేషన్ కాగితాలు తీసుకువెళ్లాలని ఆర్‌ఐ చెప్పడంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. ఎంతగా ప్రయత్నించినా డబ్బు దొరకకపోవడంతో గురువారం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రాంచంద్ర తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని కొంత తగ్గించాలని మరోసారి ఆర్‌ఐని బతిమాలుకున్నాడు. అయినప్పటికీ వినిపించుకోని ఆర్‌ఐ రూ.15 వేలు తెస్తేనే మ్యుటేషన్ కాగితాలు ఇస్తాననీ, లేకుంటే కాగితాలు తారుమారు చేస్తానంటూ హెచ్చరించాడు. ఆందోళనకు గురైన రాంచంద్ర మెదక్, నిజామాబాద్ జిల్లాల ఏసీబీ డీఏస్పీ సంజీవరావును సంప్రదించాడు. ఏసీబీ డీఎస్పీ సూచన మేరకు రూ.15 వేలు తీసుకుని సాయంత్రం 4.30 గంటలకు తహశీల్దార్ కార్యాలయం చేరుకున్నాడు.
విధుల్లో ఉన్న ఆర్‌ఐ సతీష్‌కు డబ్బులు అందజేశాడు. ఈ సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేశారు. వెంటనే తేరుకున్న ఆర్‌ఐ డబ్బును అక్కడే పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఆర్‌ఐని అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ సంజీవరావు, లంచం ఆర్‌ఐ సతీష్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. లంచం కోసం వేధించే అధికారుల సమాచారమిచ్చి అవినీతి నిర్మూలనకు సహకరించాలని కోరారు. బాధితులు తమ ఫిర్యాదులను తన సెల్ 9440446155కు ఫోన్ చెప్పవచ్చన్నారు. దాడిలో మెదక్ పోలీసులు కూడా పాల్గొన్నారు.
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
Published Sat, Oct 5 2013 1:20 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement