కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : ఇంతకాలం ఏసీబీ అధికారుల దాడులకు దూరంగా ఉండేది వ్యవసాయ శాఖ. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. అవినీతి నిరోధక విభాగం అధికారుల నజర్ తొలిసారి జిల్లాలోని వ్యవసాయ శాఖపై పడింది. ఇది ఆ శాఖ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. వ్యవసాయశాఖలో అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. రైతులకు పరిహారం పంపిణీలోనూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఏడీఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రణవీందర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం చర్చనీయాంశమైంది.
కొంతకాలంగా కరీంనగర్ అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయంలో ప్రతీ పనికి పెద్ద మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లంచం ఇవ్వనిదే ఏ పనీ అయ్యే పరిస్థితి లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫర్టిలైజర్ దుకాణ అనుమతి కోసం సీనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్ చేయడంతో భరించలేని శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు పక్కా ప్రణాళిక ప్రకారం గురువారం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇందులో అధికారులకు కూడా భాగం ఉండవచ్చనే ఆరోపణలున్నాయి. దీని వెనక ఎవరైనా ఉంటే విచారణ నిర్వహించి, వారిపైనా కేసులు నమోదు చేస్తామని దాడుల సమయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పేర్కొనడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అన్ని శాఖలపై దృష్టి
గతంలో అవినీతిలో మొదటిస్థానంలో ఉందన్న అపవాదు రెవెన్యూ శాఖకు ఉంది. దీంతో కిందిస్థాయి సిబ్బందిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకూ 30 మందికి పైగా రెవెన్యూ సిబ్బందిని, 10 మందికి పైగా ఇతర శాఖల వారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం, విద్యుత్‌శాఖ అధికారులపై అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నా మొదటిసారిగా వ్యవసాయశాఖపై దాడి చేయడం గమనార్హం.
అయితే పోలీసు శాఖలోనూ అవినీతిపరులు పెరిగిపోతున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో చొప్పదండి పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసినా... ఇప్పటివరకు మళ్లీ దాడులు లేవు. కొందరు అధికారులైతే బాధితులను కూడా వదలడం లేదనే ఆరోపణలున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అనవసర ఖర్చనే భయంతో కొందరు వెళ్లి ఫిర్యాదు చేయడానికే వెనకాముందాడుతున్నారు. పోలీసుశాఖపైనా ఏసీబీ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.