ADA office
-
ఎప్పుడు చూసినా తాళమే..
తెరుచుకోని ఏడీఏ కార్యాలయం రాయికోడ్: మండల కేంద్రం రాయికోడ్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఏడీఏ కార్యాలయం గత కొన్ని రోజులుగా తెరుచుకోవడంలేదు. రాయికోడ్ మండలంతో పాటు రేగోడ్, మునిపల్లి మండలాల రైతుల ప్రయోజనం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సొంతం భవనం లేని కారణంగా గ్రామ చివరన ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న గదులను తాత్కాలికంగా ఏడీఏ కార్యాలయానికి కేటాయించారు. ఖరీఫ్ పంటల సాగులో రైతులు అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందుబాటులో ఉంటూ వెన్నుదన్నుగా ఉండాల్సిన ఏడీఏ, కార్యాలయ సిబ్బంది తమకు అందుబాటులో ఉండటంలేదని రైతులు వాపోతున్నారు. కార్యాలయం ఏర్పాటు చేసి సుమారు 4 నెలలవుతున్నా వారానికి ఒకసారి కూడా ఏడీఏ కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ఏడీఏ, కార్యాలయ సిబ్బంది తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్నారా లేక డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సందేహ నివృత్తి కోసం ఎన్నిసార్లు ఏడీఏ కార్యాలయానికి వెళ్లినా తాళం వేసి ఉంటోందని రైతులు తెలిపారు. ఈ విషయమై ఏడీఏ మాధవిని వివరణ కోరుగా మునిపల్లి, రేగోడ్ మండలాల్లో చేపట్టిన పలు కార్యాక్రమాల్లో పాల్గొనడం, శాఖాపరమైన సమావేశాలు, ఉన్నతాధికారుల సమీక్షలు ఉన్నందున తాను పర్యటనల్లో ఉన్నానన్నారు. జూనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్‌పై వెళ్లినట్లు చెప్పారు. ఏఓ, ఏఈఓలు మండలంలో అందుబాటులో ఉంటారని అత్యవసర పరిస్థితులు, ముఖ్యమైన కార్యక్రమాల సమయాల్లో తాను మండలకేంద్రంలోని కార్యాలయానికి వస్తానని వివరించారు. -
కరెంటు కోతలపై బీజేపీ నిరసన
జహీరాబాద్ టౌన్: కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. జహీరాబాద్ సబ్‌స్టేషన్ ధర్నా నిర్వహించి ఏడీఏ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీ సులు వీరిని స్టేషన్‌కు తరలించారు. వివరాలు.. కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లికార్జున్‌పాటిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు జహీరాబాద్ సబ్ స్టేషన్ ధర్నా నిర్వహించాయి. అంతకు ముం దు స్థానిక అతిథి గృహం నుంచి సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌పాటిల్ మా ట్లాడుతూ.. మండల పరిధిలోని రైతులు వందల ఎకరాల్లో చెరకు, అల్లం, పసు పు, అరటి తదితర పంటలను సాగుచేశారని తెలిపారు. అయితే కరెంట్ కోతల వల్ల ఇవి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి రెండు మూడు గంటలకు మించి కరెంట్ ఇవ్వడంలేదన్నారు. రాత్రీపగలు లేకుండా కోతలు విధిస్తున్నారని తెలిపారు. ట్రాన్స్‌కో ఏడీఈ తులసీరాం నాయకులతో ఫోన్లో మాట్లాడుతూ... వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలో కరెంట్ సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. ధర్నాలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బస్వరాజ్‌పాటిల్, మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ ఉపాధ్యక్షుడు శివ, కార్యదర్శి అజయ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, విశ్వనాథ్ యాదవ్, నరేష్, బండి వెంకట్ పాల్గొన్నారు. -
ఆదర్శ రైతుల ఆగ్రహం
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆదర్శ రైతులు కన్నెర్ర చేశారు. ఆరు సంవత్సరాలుగా గ్రామాల్లో రైతులకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉంటున్న ఆదర్శ రైతు వ్యవస్థను తొలగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట ఏడీఏ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో శాంతి యుతంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. ఆదర్శ రైతు వ్యవస్థ రద్దు చేసి, వారి స్థానంలో వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్హత కలిగిన వారిచే ఏఈఓల వ్యవస్థను నిర్మించేం దుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేట సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆదర్శ రైతులు సోమవారం స్థానిక మార్కెట్ యార్డులోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒక దశలో కార్యాలయ ముట్టడికి యత్నించారు. విధుల్లోకి వచ్చే అధికారులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. నిరసన శాంతియుతంగా కొనసాగాలని సూచించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మార్గ మధ్యలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ అధికారులకు అందజేసి ఆదర్శ రైతు వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆదర్శ రైతు సంఘం ప్రతినిధులు వెంకట్రాంరెడ్డి, సత్యం, మహేందర్, పరశురాములు, మల్లయ్య, కనకయ్య, మధు, యాదయ్య, రాజు పాల్గొన్నారు. ఆదర్శ రైతులపై కేసు అనుమతి లేకుండా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించినందుకు గాను 12 మంది ఆదర్శ రైతులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ ఎస్ఐ వరప్రసాద్ కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం ఉపాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను అనుమతి లేకుండా దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటనలో వెంకట్రాంరెడ్డితో పాటు మరో 11 మంది ఆదర్శ రైతులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రుణమాఫీపై డ్రామాలు ఎందుకు?
సాలూరు:ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న టీడీపీ నాయకులు ఇప్పుడు మాఫీ విషయంలో డ్రామాలు ఆడడం సరికాదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఏడీఏ కార్యాలయం వద్ద పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై పాలకులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారన్నారు. రీషెడ్యూల్ చేసినా కొత్తగా రైతులకు రుణాలు మంజూరు కావన్నారు. ప్రభుత్వం తీరు వల్ల రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నార న్నారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా పంట రుణాలను మాఫీ చేసి కొత్త రుణా లు అందేలా చేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వరుణుడు రావొద్దన్న ఫైల్‌పై సంతకం చేయడంతోనే వర్షా లు పడడం లేదని ఎద్దేవా చేసారు. ఏడీఏ వెంకటయ్య మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖాధికారులు పొలాల్లో పర్యటించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. అనంతరం మండలంలోని శివరాంపురం, చంద్రపువలస గ్రామా ల పరిధిలోని పొలాల్లో పర్యటించారు.ఈ కార్యక్రమంలో పాచిపెంట మం డల వైస్ ఎంపీపీ టి.గౌరీశ్వరరావు, ఏఓ అనురాధ, ఏఈఓలు పాల్గొన్నారు. -
అగ్రికల్చర్‌పై నజర్
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : ఇంతకాలం ఏసీబీ అధికారుల దాడులకు దూరంగా ఉండేది వ్యవసాయ శాఖ. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. అవినీతి నిరోధక విభాగం అధికారుల నజర్ తొలిసారి జిల్లాలోని వ్యవసాయ శాఖపై పడింది. ఇది ఆ శాఖ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. వ్యవసాయశాఖలో అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. రైతులకు పరిహారం పంపిణీలోనూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఏడీఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రణవీందర్రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం చర్చనీయాంశమైంది. కొంతకాలంగా కరీంనగర్ అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయంలో ప్రతీ పనికి పెద్ద మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లంచం ఇవ్వనిదే ఏ పనీ అయ్యే పరిస్థితి లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫర్టిలైజర్ దుకాణ అనుమతి కోసం సీనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్ చేయడంతో భరించలేని శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు పక్కా ప్రణాళిక ప్రకారం గురువారం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇందులో అధికారులకు కూడా భాగం ఉండవచ్చనే ఆరోపణలున్నాయి. దీని వెనక ఎవరైనా ఉంటే విచారణ నిర్వహించి, వారిపైనా కేసులు నమోదు చేస్తామని దాడుల సమయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పేర్కొనడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అన్ని శాఖలపై దృష్టి గతంలో అవినీతిలో మొదటిస్థానంలో ఉందన్న అపవాదు రెవెన్యూ శాఖకు ఉంది. దీంతో కిందిస్థాయి సిబ్బందిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకూ 30 మందికి పైగా రెవెన్యూ సిబ్బందిని, 10 మందికి పైగా ఇతర శాఖల వారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం, విద్యుత్‌శాఖ అధికారులపై అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నా మొదటిసారిగా వ్యవసాయశాఖపై దాడి చేయడం గమనార్హం. అయితే పోలీసు శాఖలోనూ అవినీతిపరులు పెరిగిపోతున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో చొప్పదండి పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసినా... ఇప్పటివరకు మళ్లీ దాడులు లేవు. కొందరు అధికారులైతే బాధితులను కూడా వదలడం లేదనే ఆరోపణలున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అనవసర ఖర్చనే భయంతో కొందరు వెళ్లి ఫిర్యాదు చేయడానికే వెనకాముందాడుతున్నారు. పోలీసుశాఖపైనా ఏసీబీ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.