ఆదర్శ రైతుల ఆగ్రహం
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆదర్శ రైతులు కన్నెర్ర చేశారు. ఆరు సంవత్సరాలుగా గ్రామాల్లో రైతులకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉంటున్న ఆదర్శ రైతు వ్యవస్థను తొలగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట ఏడీఏ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో శాంతి యుతంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు.
ఆదర్శ రైతు వ్యవస్థ రద్దు చేసి, వారి స్థానంలో వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్హత కలిగిన వారిచే ఏఈఓల వ్యవస్థను నిర్మించేం దుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేట సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆదర్శ రైతులు సోమవారం స్థానిక మార్కెట్ యార్డులోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒక దశలో కార్యాలయ ముట్టడికి యత్నించారు. విధుల్లోకి వచ్చే అధికారులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. నిరసన శాంతియుతంగా కొనసాగాలని సూచించారు.
దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మార్గ మధ్యలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ అధికారులకు అందజేసి ఆదర్శ రైతు వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆదర్శ రైతు సంఘం ప్రతినిధులు వెంకట్‌రాంరెడ్డి, సత్యం, మహేందర్, పరశురాములు, మల్లయ్య, కనకయ్య, మధు, యాదయ్య, రాజు పాల్గొన్నారు.
ఆదర్శ రైతులపై కేసు
అనుమతి లేకుండా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించినందుకు గాను 12 మంది ఆదర్శ రైతులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ ఎస్‌ఐ వరప్రసాద్ కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం ఉపాధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను అనుమతి లేకుండా దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటనలో వెంకట్‌రాంరెడ్డితో పాటు మరో 11 మంది ఆదర్శ రైతులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.