తాళం వేసి ఉన్న ఏడీఏ కార్యాలయం
- తెరుచుకోని ఏడీఏ కార్యాలయం
రాయికోడ్: మండల కేంద్రం రాయికోడ్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఏడీఏ కార్యాలయం గత కొన్ని రోజులుగా తెరుచుకోవడంలేదు. రాయికోడ్ మండలంతో పాటు రేగోడ్, మునిపల్లి మండలాల రైతుల ప్రయోజనం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సొంతం భవనం లేని కారణంగా గ్రామ చివరన ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న గదులను తాత్కాలికంగా ఏడీఏ కార్యాలయానికి కేటాయించారు.
ఖరీఫ్ పంటల సాగులో రైతులు అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందుబాటులో ఉంటూ వెన్నుదన్నుగా ఉండాల్సిన ఏడీఏ, కార్యాలయ సిబ్బంది తమకు అందుబాటులో ఉండటంలేదని రైతులు వాపోతున్నారు. కార్యాలయం ఏర్పాటు చేసి సుమారు 4 నెలలవుతున్నా వారానికి ఒకసారి కూడా ఏడీఏ కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ఏడీఏ, కార్యాలయ సిబ్బంది తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విధుల్లో ఉన్నారా లేక డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సందేహ నివృత్తి కోసం ఎన్నిసార్లు ఏడీఏ కార్యాలయానికి వెళ్లినా తాళం వేసి ఉంటోందని రైతులు తెలిపారు. ఈ విషయమై ఏడీఏ మాధవిని వివరణ కోరుగా మునిపల్లి, రేగోడ్ మండలాల్లో చేపట్టిన పలు కార్యాక్రమాల్లో పాల్గొనడం, శాఖాపరమైన సమావేశాలు, ఉన్నతాధికారుల సమీక్షలు ఉన్నందున తాను పర్యటనల్లో ఉన్నానన్నారు.
జూనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్‌పై వెళ్లినట్లు చెప్పారు. ఏఓ, ఏఈఓలు మండలంలో అందుబాటులో ఉంటారని అత్యవసర పరిస్థితులు, ముఖ్యమైన కార్యక్రమాల సమయాల్లో తాను మండలకేంద్రంలోని కార్యాలయానికి వస్తానని వివరించారు.