అనంతపురం అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి విభజన చట్టం ప్రకారం రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ సీపీఐ, దాని అనుబంధ సంఘాలు బుధవారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం రణరంగంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాదోపవాదనలు, తోపులాట జరిగింది. చివరికి పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి ముఖ్య నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఉదయం స్థానిక కృష్ణకళామందిరం నుంచి టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న ప్రధాన తపాలశాఖ, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాల వరకు సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయాల సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ప్రధాన గేటు ముందు దాదాపు అరగంటపాటు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులకు, సీపీఐ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, జిల్లా కార్యదర్శి డి. జగదీష్, మరికొంత మంది నాయకులు అరెస్ట్ చేసే దిశగా ప్రయత్నించారు.
దీంతో వందలాదిగా వచ్చిన సీపీఐ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను చేధించుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసుకుల ఆందోళనకారులకు మధ్య తోపులాటలతో ఆ ప్రాంతమంతా రణరంగమైంది. రాష్ట్రానికి జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ప్రశ్నిస్తే మాపైనే దౌర్జన్యం చేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు. పోలీసులు ముందుకు కదలనీయకపోవడంతో ఆందోళనకారులు కార్యాలయాలపై రాళ్లు విసిరారు. దీంతో కార్యాలయాల అద్దాలు పగిలాయి.
దీంతో పోలీసులు ఒక్కసారిగా మహిళలను సైతం లెక్కచేయకుండా తోయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింఇ. సీపీఐ కార్యకర్తలు ప్రధాన గేటును చేధించుకుని తపాలశాఖ కార్యాలయం, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మల్లికార్జునశర్మ అక్కడికి వచ్చి నాయకులను శాంతించాలని కోరారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు తపాలశాఖ కార్యాలయం ముందు బైఠాయించి పోలీసుల దౌర్జాన్యానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మరోసారి పోలీసులకు, సీపీఐ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తితకు దారి తీసింది. సీపీఐ నాయకుడు మల్లికార్జునకు కాలుకు తీవ్రమైన గాయం కాగా.. కార్పొరేటర్ పద్మావతిని పోలీసులు కిందకు తోయడంతో బట్టలు చినిగిపోయాయి.
ఆగ్రహించిన మహిళలు
ఇంత పెద్ద ఎత్తున జరిగిన ముట్టడి కార్యక్రమానికి మహిళ పోలీసులను నియమించకుండా మగ పోలీసులే మహిళలపై దాడికి దిగడంతో ఆందోళనకారుల్లో నిరసన తీవ్రమైంది. దీంతో మహిళలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీ ప్రతాపం మాపై చూపుతారా..? అంటూ ఒక స్థాయిలో పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక ్తం చేశారు. ఇదే సమయంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ పోలీసుల తీరును తీవ్రంగా నిరసించారు.
ఆడవాళ్ల బట్టలు చిరిగేలా ప్రవ ర్తిస్తారా... ఇదేం పద్ధతి అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని పదిమందికి తెలపడానికి ప్రయత్నిస్తే ఇలాగేనా చేసేది అంటూ దుయ్యబట్టారు. వెంటనే జాఫర్‌ను అరెస్ట్ చేయడంతో పోలీసులు, సీపీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఈ సమయంలో మరింత పోలీసు బలాగాలను మోహరించి నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, జిల్లా కార్యదర్శి డి. జగదీష్, నాయకులు నారాయణస్వామి, జాఫర్, నగర కమిటీ నాయకులు సి. లింగమయ్య, మల్లికార్జున, కె. కాటమయ్య, కేశవరెడ్డి, శంకుతలమ్మ, కార్పొరేటర్ పద్మావతి, అమీనామ్మ, రఘురామయ్య, రామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రమణ, చాంద్ బాషా, గాదిలింగా, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సాకే నరేష్, మనోహార్, రాజేష్, బాలపెద్దన్న, పద్మావతి, జయలక్ష్మి, తదితరులను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో
సీపీఐ నేతల నిద్ర
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో బుధవారం సీపీఐ నేతలు చేపట్టిన కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతను దారితీయడంతో పోలీసులు అరెస్టు చేసి స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.
నాన్‌బెయిల్ కేసులు నమోదు చేయడంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌తో పాటు వందలాది మంది జిల్లా నాయకులు, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు, మహిళా విభాగం నేతలు మొత్తం 115 మందిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. మధ్యాహ్నం నుంచి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాయకులు, కార్యకర్తలకు పోలీసులే భోజనాలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నాయకులందరూ నిద్రపోయారు.
ఆందోళన ఉధృతం చేస్తాం
అనంతపురం టౌన్: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల సాధనకు ఆందోళనలు ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి, ప్రతినిధులను ప్రధాన మంత్రి వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై సీఎం స్పందించి ప్రకటన చేసే వరకు తమను అరెస్టు చేసి ఉంచిన పోలీసు స్టేషన్‌లోనే ధర్నాను కొనసాగిస్తామన్నారు. బుధవారం కేంద్ర కార్యాలయాల ముట్టడిలో రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఉంచారు. అక్కడే రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ, వెనబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ ఇలా అన్ని అంశాల్లోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్నపుడు వెంకయ్యనాయుడు చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలోనూ ఇదే మాట చెప్పి బీజేపీ, టీడీపీలు కలిసి ప్రజలతో ఓట్లు వేయించుకున్నాయన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టానికి తూట్లుపొడుస్తున్నారని మండిపడ్డారు.
రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్ అంటే రూ.550 కోట్లతో సరిపెట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు రూ.23,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అంటే, జిల్లాకు రూ.50 కోట్లుగా రూ.350 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తం నీటి ఎద్దడి నివారణకు కూడా సరిపోదన్నారు. హైదరాబాద్ తరహా రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు అవుతుందని చెప్పిన చంద్రబాబు, నిర్మాణానికి రూ.1.13 లక్షల కోట్లు ఖర్చు అవుతుందంటారు, కేంద్రానికి రూ.20,980 కోట్లు కావాలని నివేదికలో కోరారన్నారు. అయితే కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వడం లేదు. చంద్రబాబు ఒత్తిడి చేయడంలేదని ధ్వజమెత్తారు.
ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు చంద్రబాబునాయుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, అఖిలపక్ష ప్రతినిధులను స్వయంగా ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఆయన నుంచి ఆ ప్రకటన వెలువడేంత వరకు తమను అరెస్టు చేసి ఉంచిన పోలీసు స్టేషన్‌లోనే ఉండి ధర్నా చేస్తామన్నారు. సబ్‌జైలుకి తరలిస్తే అక్కడా కొనసాగిస్తామన్నారు. అవసరమైతే తమ కార్యకర్తలు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తారని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సహయ కార్యద ర్శులు జాఫర్, నారాయణస్వామి, రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యురాలు అమీనమ్మ, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, నగర కార్యదర్శి లింగమయ్య, నాయకులు కాటమయ్య, తదితరులు పాల్గొన్నారు.
రణరంగం!
Published Thu, Mar 12 2015 2:25 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement