గుంటూరు: గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయం వద్ద ఫిబ్రవరి లో ప్రేమికులపై దాడి ఘటనలో నిందితుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన బాజి(28) అనే వ్యక్తి ప్రేమికులపై దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలో కూడా నలుగురు యువతులపై లైంగిక దాడి చేసినట్టు విచారణలో తేలింది. బాజీని గతంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి అరెస్టు చేయగా, బెయిల్ పై బయటకు వచ్చాడు.
కాగా ఫిబ్రవరి లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పీఆర్సీ తండాకు చెందిన బానోతు స్వాతి (18), మాచర్ల మండలం శ్రీరాంపురం తండాకు చెందిన నాయక్(20) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. కోటప్పకొండ ఆలయంలో దైవదర్శనానికి వచ్చిన ఇరువురూ మెట్ల మార్గంలో వెళుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో బెదిరించి నగదు, విలువైన వస్తువులు దోచేయత్నం చేశారు. నాయక్ అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు అతణ్ణి పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్త్రావమై నాయక్ మరణించగా స్వాతి తీవ్ర గాయాలపాలైంది.