సర్కారు తీరుపై ఎమ్మెల్యేలు ఫైర్ | Accusing the government MLAs Fire | Sakshi
Sakshi News home page

సర్కారు తీరుపై ఎమ్మెల్యేలు ఫైర్

Published Sat, Dec 20 2014 1:11 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

Accusing the government MLAs Fire

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ చెందిన ఎమ్మెల్యేలు జిల్లా వాణిని గట్టిగా వినిపించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలు సమస్యలపై ధ్వజమెత్తారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఫీజు రీయింబ ర్స్‌మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోందని సిటీ ఎమ్మె ల్యే అనిల్ మండిపడ్డారు.
 
 రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవటాన్ని తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. నిధులు విడుదల చేయకపోవటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు అప్పు లు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
 
 రాష్ట్రవ్యాప్తంగా నిధులు విడుదల కాకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా అందాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవటంతో జిల్లాలో వేలాది మం ది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. విద్యాసంస్థలు బకాయిల కోసం ఒత్తిడి చేస్తుండటంతో కొందరు విద్యార్థులు కళాశాలలకు వెళ్లడం మానేసినట్లు తెలిసిందన్నారు. ముఖ్యమంత్రికి చంద్రబాబుకు అబద్ధాలు చెప్పటంలో డాక్టరేట్ ఇవ్వొచ్చని విమర్శించారు.
 
 అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనం రేపాయి. జిల్లా మంత్రి నారాయణపై ఫైర్ అయ్యే ఎమ్మెల్యే అనిల్ అసెంబ్లీలో సీఎంను విమర్శించడాన్ని జనం చర్చించుకోవటం కనిపించింది.
 
 గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తాగునీటి కోసం విడుదల చేసిన నిధులను కొంద రు అక్రమార్కులు దుర్వినియోగం చేసినా, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గూడురు పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు ఇచ్చేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రూ.64.13 కోట్లు మంజూరు చేశారని, కండలేరు నుంచి గూడూరు వరకు పైప్‌లైన్ ఏర్పా టు చేసి నిరంతరం నీరివ్వాల్సి ఉందని తెలిపారు.
 
  పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఓ కాంట్రాక్టర్ చేపట్టిన ఆ పనుల్లో పెద్ద ఎత్తును నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలున్నాయని తెలిపారు. పైపులు నాసిరకంగా వేశారని, పనులు పూర్తి కాకముందే సంబంధిత అధికారులు పూర్తయినట్లు మున్సిపాలిటీకి అప్పగించటాన్ని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తప్పుబట్టారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి గూడూరుకు తాగునీరు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
 కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై ప్రస్తావించారు.
 
  రైతులు పంటలు వేయక ముందు నీరిస్తామని చెప్పిన అధికారులు తీరా సాగుచేశాక ఇప్పుడు నీళ్లివ్వలేమంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి కాలువ బాగుచేయకపోవటంతో రైతులు మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం నీరివ్వలేకపోతే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
 కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి చక్కెర ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చెరకు రైతులను ఆదుకోవాలని కోరారు.అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై తమ వాణి వినిపించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement