సర్కారు తీరుపై అసహనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పరిపాలన, నిధుల విడుదల, సాగు, తాగునీరు సౌకర్యాలు కల్పించటం వంటి విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వానిదే.
ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యులైన టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, జిల్లా అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం. కీలకమైన సమావేశానికి జిల్లా మంత్రి నారాయణ, కలెక్టర్ హాజరు కాకపోవటం వారిని ఇబ్బందికి గురిచేసింది. ఈ విషయాన్ని ఎక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారోనని టీడీపీ నేతలు ముందే మంత్రి, కలెక్టర్ వచ్చాకే సమావేశం నిర్వహించాలని, అంత వరకు వాయిదా వేయమని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ చేయటం గమనార్హం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగునున్న నేపథ్యంలో స్థానిక సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు.
మంత్రి నారాయణ, కలెక్టర్ రాకపోవటాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ సరైనదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం వాయిదా వేసేందుకు ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, వై.శ్రీనివాసులురెడ్డి లేవనెత్తారు.
సాగు,తాగునీటిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలకు ముందే మరో సారి జడ్పీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇసుక మైనింగ్ విధానంపైనా టీడీపీ సభ్యులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి జేసీ రేఖారాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమేమైనా పై నుంచి దిగివచ్చిన దేవతా? అంటూ టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి ప్రశ్నిస్తూ నిరసన తెలియజేయటంతో పాటు సభ నుంచి వాకౌట్ చేశారు. జేసీపై ఆయన విమర్శలు చేస్తున్నంత సేపు తమ్ముళ్లు కూడా ఒకింత ఆశ్చ్యరానికి, మరోవైపు ఆందోళనకు గురయ్యారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది.
జెడ్పీటీసీలకు ప్రాధాన్యం ఇవ్వండి
ప్రజలు ఎన్నుకున్న తమకు తగిన గుర్తింపు లేదు. అధికారులు తమను పెద్దగా పట్టించుకోవడంలేదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాకు పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అంటూ పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలాల్లో ఎంతో కీలకమైన తమ మాటలకు అధికారులు విలువ ఇవ్వడంలేదని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి జోక్యం చేసుకుని శ్రీధర్‌రెడ్డికి సర్దిచెప్పి సమావేశాన్ని కొనసాగించారు.
ఇరిగేషన్, ఇసుక చుట్టూనే సమావేశం..
సమావేశం మొత్తం దాదాపుగా ఇరిగేషన్, ఇసుక అంశాల చుట్టూనే తిరిగింది. ఇసుక అంశంపై ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకధాటిగా సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. జిల్లాలో ఇసుక అక్రమం తవ్వకం, రవాణా ఎక్కువగా జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి వివరణ ఇస్తూ ఎమ్మెల్యేల సూచనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. టైరు బండి కార్మికుల విషయంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమావేశంలో తన వాణి గట్టిగా వినిపించారు. వరా్షాలు కురవక, కాలువల్లో నీరు లేకపోతే ఎలా అని వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకే మంత్రి, కలెక్టర్ సమక్షంలో మరో సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.