విభజన హామీలు గాలికి.. | achieved more growth rate than national average, says governor narasimhan | Sakshi
Sakshi News home page

విభజన హామీలు గాలికి..

Published Sun, Mar 6 2016 8:46 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

విభజన హామీలు గాలికి.. - Sakshi

విభజన హామీలు గాలికి..

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలును కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలిపెట్టేసిందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధిరేటులో జాతీయ సగటును రాష్ట్రం దాటిందని, రానున్న ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధిరేటు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, మండలిల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత ఏడాది చేపట్టిన కార్యక్రమాలు, రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.

అధ్యక్ష మహోదయా అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్.. అనర్గళంగా అరగంటపాటు ఇంగ్లిష్‌లో దానిని కొనసాగించారు. ‘మన చర్యలను బట్టే మన భవిష్యత్ ఉంటుంది’ అని వివేకానందుడి సూక్తులను చెబుతూ... ప్రజా ప్రతినిధులుగా ప్రజా సేవలో అంకితం కావాలని పిలుపునిచ్చి ప్రసంగాన్ని ముగించారు. అధ్యక్షస్థానంలో గవర్నర్‌కు ఇరువైపులా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, రాజధానికి గ్రాంట్లు, రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టుకు సహాయం.. ఏ ఒక్క హామీని కేంద్రం నిలబెట్టుకోలేదు.
* 2015-16 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.99 శాతంగా నమోదయింది. జాతీయ స్థాయిలో వృద్ధిరేటు కేవలం 7.6 శాతమే. రానున్న ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యం. ఇలా రెండంకెల వృద్ధిరేటును రానున్న 14 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది.
* ఈ ఏడాది జూన్‌కు తోటపల్లి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, 2017 జూన్‌కు వంశధార రెండో దశ, వెలిగొండ, 2018 జూన్‌కు పోలవరం తొలి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం. కృష్ణా, పెన్నా నదులను అనుసంధానిస్తాం.
* రైతుల రుణమాఫీ రూ. 24,500 కోట్లు, ఉద్యానవన రైతులకు రూ. 600 కోట్ల మాఫీ చేయాలని ప్రణాళిక. ఇప్పటి వరకు రూ. 7,433 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించింది.
* విద్యార్థులకు ఉపకార వేతనాలను ఏటా కాకుండా నెలవారీగా చెల్లించే విధానానికి మారనుంది. హాజరును పర్యవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని హాస్టళ్లలో ప్రవేశపెట్టనున్నాం. హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చనున్నాం.
* బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా.. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 8 నెలల లోపు జస్టిస్ మంజునాథ్ కమిషన్ నివేదిక అందుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. కాపు కార్పొరేషన్‌కు వచ్చే బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు కేటాయింపు.
* రజకులను ఎస్సీల్లో, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రానికి ప్రభుత్వం సిఫారసు చేయనుంది.
* యువతలో నైపుణ్యాల వృద్ధికి వచ్చే ఏడాది రూ. 500 కోట్లు ఖర్చు పెట్టనుంది.
* ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వాటి నిర్వహణను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వనున్నాం.
* ప్రైవేటు యూనివర్సిటీల రాకకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈ చర్య దోహదం చేస్తుంది.
* ఈ ఏడాదిలో 2,704 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయింది.
* రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా చే యాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద బహిరంగ మలవిసర్జన రహి త రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.
* 2022 నాటికి రాష్ట్రంలో అందరికీ గృహాలు సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
* మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సమర్థవంతమైన ఇసుక విధానం కీలక పాత్ర పోషిస్తుంది. సామాన్యులకు అధికారిక ఇసుక క్వారీల నుంచి ఉచితంగా సేకరించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
* రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
* విద్యుత్ సరఫరా నష్టాలను 10.29 శాతానికి ప్రభుత్వం తగ్గించగలిగింది. వచ్చే ఏడాదికి ఈ నష్టాలను సింగిల్ డిజిట్‌కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* రైతులకు ఇప్పటికే 3 వేల సోలార్ పంప్‌సెట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 వేల పంపుసెట్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 619 మెగావాట్ల సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నాం.
* రాష్ట్రంలో ఇంకా మిగిలిన 4.6 లక్షల కుటుంబాలకు విద్యుదీకరణ పూర్తి చేస్తాం.
* నౌకాశ్రయాల ఆధారిత అభివృద్ధి నమూనాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాన్ని ‘లాజిస్టిక్ హబ్’గాను, భారత్‌కు ‘గేట్‌వే’గానూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
* ఫ్లోటింగ్ స్టోరేజ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్, కాకినాడ-విశాఖ గ్యాస్ పైల్‌లైన్ పనులను 2016-17 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్నాం. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నగర గ్యాస్ పంపిణీని కూడా ప్రారంభిస్తాం.
* అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లేదా ఆరు లేన్ల రోడ్లు నిర్మించనున్నాం. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకూ రోడ్లను నిర్మించి అనుసంధానాన్ని మెరుగుపరుస్తాం. 1,250 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించింది.
* కర్నూలు, కడప జిల్లాలను కలుపుతూ, అనంతపురం మీదుగా అమరావతి-బెంగుళూరు మధ్య ‘ఎక్స్‌ప్రెస్‌వే’ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
* కూచిపూడి గ్రామంలో కూచిపూడి నాట్యారామం పేరిట విశిష్ట భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
* కర్నూలును ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించనుంది.
* అమరావతిని ప్రపంచస్థాయి రాజధాని నగరంగా నిర్మించగలమనే నమ్మకం ప్రభుత్వానికి ఉంది.
* ఈ ఏడాది అన్ని కుటుంబాలకు 10-15 ఎంబీపీఎస్ ఇంటర్‌నెట్ సౌకర్యం సమకూర్చనుంది. రూ. 150కు కేబుల్ టీవీ, ఇంటర్‌నెట్, టెలిఫోన్.. సేవల ప్యాకేజీని అందించడానికి ఏపీ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement